అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అగ్రికల్చర్ పోయి.. గన్ కల్చర్ వచ్చిందన్నారు.
తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో గురువారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి తుపాకి ఇచ్చారని స్వయంగా మంత్రి కొండా సురేఖ కూతురు చెప్పారని గుర్తు చేశారు. మరోవైపు పోలీసులు ఏమో కొండా మురళి తుపాకి ఇస్తే సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ బెదించాడని అంటున్నారని చెప్పారు. అయితే బెదిరించిన మాట వాస్తవమే కదా అని ఆయన అన్నారు. నిందితుడిని స్వయంగా మంత్రి తీసుకుపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించలేదన్నారు.
KTR | భయపడుతున్న అధికారులు
సీఎం రేవంత్రెడ్డి పాలనలో అధికారులు భయపడుతున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల తీరుతో ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ పదేళ్ల సర్వీస్ ఉండగా.. వీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. మంత్రులు చేసే తప్పులకు బలి కావొద్దని కేటీఆర్ అధికారులకు సూచించారు. కాంగ్రెస్ అరాచకాలకు వత్తాసు పలికితే తప్పకుండా శిక్ష పడుతుందని ఆయన హెచ్చరించారు. ఐఏఎస్ అధికారులు రాజీనామా చేస్తుంటే, పారిశ్రామికవేత్తలను తుపాకులు పెట్టి బెదిరిస్తుంటే.. బీజేపీ (BJP) ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
