అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gulf Air Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బెహరాన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ (Shamshabad Airport)కు వచ్చిన గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.
దేశంలో బాంబు బెదిరింపులు ఆగడం లేదు. విమానాలు, రైల్వే స్టేషన్లు, పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేస్తున్నారు. పలువురు మెయిల్స్ పంపుతున్నారు. దీంతో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా గల్ఫ్ ఎయిర్‌లైన్స్ (Gulf Airlines)కు చెందిన విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. విమానాన్ని పైలెట్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం ప్రయాణికులను ఐసోలేషన్ (Isolation) ప్రాంతానికి తరలించారు. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. ఎలాంటి బాంబు లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నకిలీ బెదిరింపుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Gulf Air Bomb Threat | భయాందోళనలో ప్రయాణికులు
ఇటీవల విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురి అవుతున్నారు. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు లక్ష్యంగా పలువురు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ ఫ్లైట్‌ను హైజాక్ చేస్తామని మెయిల్ రావడంతో అధికారులు ముంబయిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ప్రముఖ పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ రావడంతో విద్యార్థులు, యాజమాన్యాలు ఆందోళనకు గురి అయ్యాయి. నిత్యం దేశంలోని ఏదో ఒక ప్రాంతానికి బెదిరింపు మెయిల్స్, ఫోన్లు వస్తున్నాయి. ఇందులో చాలా వరకు నకిలీవే ఉంటున్నాయి. అయినా కూడా అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఫలితంగా అధికారులు, ప్రజల సమయం వృథా అవుతోంది. బాంబు బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.