అక్షరటుడే, వెబ్డెస్క్ : Group -2 Jobs | గ్రూప్–2 ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) శనివారం సాయంత్రం హైదరాబాద్ (Hyderabad)లోని శిల్పాకళా వేదికలో నియామక పత్రాలు అందించారు. టీజీపీఎస్సీ (TGPSC) నిర్వహించిన పరీక్షలో మొత్తం 783 మంది గ్రూప్–2 ఉద్యోగాలు సాధించారు.
సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం నిరుద్యోగుల కలలను సాకారం చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్ (KCR) కుటుంబం డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పాలన చేసిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు ఇచ్చారని విమర్శించారు. పదేళ్లలో గ్రూప్–1 నియామకాలు చేపట్టలేదని పేర్కొన్నారు. కానీ తమ ప్రభుత్వం రెండేళ్లలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. త్వరలో గ్రూప్–3, గ్రూప్–4 నియామక ప్రక్రియ కూడా పూర్తి చేస్తామన్నారు.
Group -2 Jobs | మూడేళ్లకే కూలిన కాళేశ్వరం
బీఆర్ఎస్ (BRS) చిత్తశుద్ధితో పని చేసి ఉంటే కాళేశ్వరం కూలిపోయేది కాదన్నారు. దేశంలో ఎక్కడ కూడా కట్టిన మూడేళ్లలో ప్రాజెక్ట్ కూలలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిందన్నారు. తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ (SC Classification)కు పరిష్కారం చూపెట్టిందని చెప్పారు. కులగణనతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
Group -2 Jobs | అడ్డుకుంటున్న బీఆర్ఎస్
ఉద్యోగాలు భర్తీ చేపట్టకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటుందని సీఎం ఆరోపించారు. కేసులు వేసి అడ్డుకోవాలని చూస్తోందన్నారు. అయినా తాము నిరుద్యోగుల కలలు సాకారం చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు తెలంగాణ అభివృద్ధి కోసం పని చేయాలన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నారు.
Group -2 Jobs | తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతాల్లో కోత
ఉద్యోగాలు సాధించిన వారు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని సూచించారు. వారు కష్టపడితేనే ఈ రోజు మీకు ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఉద్యోగాల జీతాల్లో కోత విధిస్తామన్నారు. 10 నుంచి 15శాతం జీతం తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు చట్టం తెస్తామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నిరుద్యోగుల పదేళ్ల ఎదురు చూపులకు ఇప్పుడు ఫలితం లభిస్తోందన్నారు. ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో నియామక పత్రాలు ఇచ్చిన ఘటన తన అనుభవంలో చూడలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.