అక్షరటుడే, వెబ్డెస్క్ : Group-2 Exam | నిరుద్యోగుల జీవితాలతో టీజీపీఎస్సీ, ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. వివిధ పోస్టుల భర్తీ సమయంలో నిబంధనలు పాటించకపోవడంతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏళ్లపాటు చదువుకొని ఉద్యోగం వచ్చాక కూడా కొలువులు కోల్పోయే పరిస్థితి నెలకొంది.
పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్–2 పరీక్ష (Group-2 Exam)ను హైకోర్టు తాజాగా రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం తీర్పు వెలువరించింది.ఎంతో మంది నిరుద్యోగులు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ల కోసం నిరీక్షిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఏళ్లపాటు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటారు. అయితే నోటిఫికేషన్లు వచ్చినా.. పరీక్షలు నిర్వహణలో టీజీపీఎస్సీ (TGPSC) విఫలం అవుతుంది. దీనికితోడు కోర్టుల్లో కేసులు ఉండగా.. ప్రభుత్వాలు సైతం హడావుడిగా నియామకాలు చేపడుతున్నాయి. దీంతో ఉద్యోగాలు పొందిన వారు సైతం నష్టపోయే పరిస్థితి ఉంది.
Group-2 Exam | 2016 లో పరీక్ష.. 2019లో కొలువులు
తెలంగాణ వచ్చాక తొలిసారి 2015లో గ్రూప్–2 నోటిఫికేషన్ వెలువడింది. అనంతరం 2016లో అనుబంధ నోటిఫికేషన్ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Public Service Commission) వెలువరించింది. అదే ఏడాది నవంబర్లో పరీక్షలు జరిగాయి. అనంతరం సుదీర్ఘ కాలం నిరీక్షణ అనంతరం అభ్యర్థులకు 2019లో కొలువులు వచ్చాయి. అయితే తాజాగా హైకోర్టు గ్రూప్-2 ఎంపిక జాబితాను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. దీంతో ఇన్ని రోజులు ఉద్యోగాలు చేస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు.
Group-2 Exam | తీవ్ర వ్యాఖ్యలు
గ్రూప్–2 నియామకాలపై విచారణ సందర్భంగా డివిజన్ బెంచ్ టీజీపీఎస్సీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు (High Court) ఆదేశాలను కమిషన్ ఉల్లంఘించిదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిధి దాటి వ్యవహరించిందని మండిపడింది. పరీక్ష పత్రాలను పునః మూల్యాంకన చేయాలని ఆదేశించింది. అనంతరం అర్హుల జాబితాను మళ్లీ ప్రకటించాలని పేర్కొంది. 8 వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. దీనిపై కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉద్యోగాలు పొందిన వారు ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా.. లేక పున: మూల్యాంకనం చేస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Group-2 Exam | రద్దు ఎందుకంటే..
గ్రూప్–2 కింద 1,032 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2015లో నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష నిర్వాహణ, మూల్యాంకనంపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో 2019లో నియామకాలు చేపట్టగా.. పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఓఎంఆర్ షీట్లలో దిద్దుబాటు, వైట్నర్ వినియోగం, డబుల్ బబ్లింగ్ వంటి అంశాలను సవాల్ చేశారు. దీంతో అలాంటి పేపర్లను మూల్యాంకనం చేయొద్దని గతంలోనే కోర్టు తీర్పు చెప్పింది. అయినా.. వాటిని పరిగణలోకి తీసుకోవడంతో తాజాగా పరీక్షను రద్దు చేసింది. డబుల్ బబ్లింగ్, వైట్‌నర్, ఎరైజర్ వినియోగించిన పత్రాల మూల్యాంకనం చెల్లదని స్పష్టం చేసింది.
Group-2 Exam | గ్రూప్–1 పరిస్థితి ఏమిటో..
తెలంగాణ (Telangana)లో తొలిసారి నిర్వహించిన గ్రూప్–1 పరీక్షలకు సంబంధించి నియామక ప్రక్రియ ఇటీవల పూర్తి అయింది. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. అయితే ఈ అంశం కూడా కోర్టు పరిధిలో ఉంది. సింగిల్ బెంచ్ పరీక్ష చెల్లదని తీర్పు చెప్పగా.. డివిజన్ బెంచ్ దానిపై స్టే ఇచ్చింది. అయితే తుది నియామకాలు తమ ఆదేశాలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. అయినా కూడా ప్రభుత్వం ఆగమేఘాల మీద అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చింది. ప్రస్తుతం ఆ కేసు విచారణ సాగుతోంది. ఈ దశలో కోర్టు నియామకాలు చెల్లవని తీర్పు చెబితే ఉద్యోగాలు పొందిన వారి పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Group-2 Exam | నిరుద్యోగులతో ఆటలు
రాష్ట్రంలోని లక్షల మంది భవిష్యత్తో టీజీపీఎస్సీ ఆటలు ఆడుతోందని విమర్శలు ఉన్నాయి. గతంలో పలు పరీక్ష ప్రత్నాలు లీక్ అయ్యాయి. గ్రూప్ –1 పరీక్ష రెండు సార్లు రద్దు అయింది. గతంలో అనేక పరీక్షలు రద్దు కాగా.. నియామకాల విషయంలో చాలా సార్లు కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయి. అయినా కూడా టీజీపీఎస్సీలో మాత్రం మార్పు రావడం లేదు. లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.
