అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Group-1 Exams | గ్రూప్–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని, లేదంటే.. పరీక్షలు పెట్టాలని హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.
హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. బుధవారం న్యాయనిపుణులు, ప్రభుత్వంతో టీజీపీఎస్సీ (TGPSC) చర్చించనుంది. అప్పీల్‌పై సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గ్రూప్–1 పరీక్షలపై అవసరం అయితే సుప్రీంకోర్టు వరకు వెళ్లాలని టీజీపీఎస్సీ యోచిస్తోంది.
Group-1 Exams | మూడో సారి..
గ్రూప్–1 నోటిఫికేషన్ (Group -1 Notification) 2022లో వెలువడింది. 2022 సెప్టెంబర్ 16న పరీక్ష నిర్వహించారు. అప్పుడు పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో పరీక్ష రద్దు చేశారు. మళ్లీ 2023 జూన్ 11న పరీక్ష జరగ్గా.. బయోమెట్రిక్ తీసుకోలేదని పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో పరీక్షను రద్దు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోసారి 2024 జూన్‌లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఫలితాలు ప్రకటించి మెయిన్స్ కోసం అభ్యర్థులను ఎంపిక చేశారు.
మెయిన్స్ పరీక్షలు 2024 అక్టోబరు 21 నుంచి 27 వరకు జరిగాయి. 2025 మార్చి 10న వీటి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే కొందరు అభ్యర్థులు మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని కోర్టును ఆశ్రయించారు. ర్యాంకింగ్ లిస్ట్ ఆధారంగా నియామక ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది. కోర్టులో కేసు ఉండటంతో టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. దీంతో న్యాయస్థానం మళ్లీ మూల్యాంకనం చేయాలని, లేదంటే పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.
Group-1 Exams | తొలిసారి..
తెలంగాణ ఏర్పాటు అయిన నాటి నుంచి గ్రూప్–1 పరీక్షలు ఒక్కసారి మాత్రమే జరిగాయి. స్వరాష్ట్రంలో తొలిసారి జరిగిన పరీక్షల నియామక ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏళ్లుగా నియామక ప్రక్రియ కొనసాగుతుండటంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.