అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kavitha | గ్రూప్–1 నియామకాలను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి (Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గ్రూప్–1 పరీక్షల (Group-1 Exams)పై గురువారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
కవిత మాట్లాడుతూ.. సమావేశంలో ఐదు తీర్మానాలు చేశామన్నారు. గ్రూప్ -1 నియామకాలు రద్దు చేసి, ప్రిలిమ్స్, మెయిన్స్ మళ్లీ నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ (Job Calendar) హామీ అమలయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని తీర్మానించినట్లు చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాల పూర్తి స్తాయిలో ఇచ్చే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. టీజీపీఎస్సీ (TGPSC)ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని, జీవో 29 ను రద్దు చేయాలని తీర్మానాలను చేశామన్నారు.
Kavitha | పనులు చేయడం లేదు..
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మాటకారి అని కవిత అన్నారు. చేయాల్సి పని చేయకుండా ప్రతిపక్షాలను తిడుతున్నారని విమర్శించారు. సీఎం, డిప్యూటీ సీఎంలు విద్యార్థుల సమస్యలపై మాట్లాడకుండా వారిని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలమైనా మనం ఆకలైనా భరిస్తాం, కానీ అవమానాన్ని భరించమన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పోరాటానికి సిద్ధం అయినట్లు కవిత తెలిపారు.
Kavitha | వారం పాటు ఆందోళనలు
గ్రూప్–1 అంశంపై వారం రోజుల పాటు ఆందోళనలు చేస్తామని కవిత తెలిపారు. శుక్రవారం అశోక్‌నగర్‌లో వంటావార్పు నిర్వహిస్తామన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం అటెన్షన్‌ను ఆట్రాక్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల పోరాటాలకు జాగృతి అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. సిటీ లైబ్రరీ, అశోక్ నగర్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) అబద్దపు అంశాలను ఎలా ముందుకు తెచ్చారో అదే ప్రాంతానికి వెళ్లి మనం నిరసన తెలపాలన్నారు. జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జీవో రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉద్యోగాలు సాధించాలని ఆమె సూచించారు. వారి తరఫున తాము పోరాటాలు చేస్తామన్నారు.
Kavitha | జడ్జీలకు తెలుగు రాకపోవడంతో..
తెలుగులో రాస్తే ఉద్యోగాలు రాని పరిస్థితి ఏంటని కవిత ప్రశ్నించారు. తెలుగు మీడియం విద్యార్థులకు న్యాయం జరగాలన్నారు. ఇప్పటికే న్యాయమూర్తులకు తెలుగు రాక న్యాయం జరగటం లేదని ఆమె అన్నారు. ఇక అధికారులకు కూడా తెలుగు రాకపోతే పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. గ్రూప్ -1 లో తెలుగులో రాసే అభ్యర్థులకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.