Cabinet Expansion
Cabinet Expansion | మంత్రివర్గ విస్తరణకు గ్రీన్​సిగ్నల్​.. చోటు దక్కేదెవరికో..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cabinet Expansion | మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై కొన్ని నెల‌లుగా కొన‌సాగుతున్న నిరీక్ష‌ణ‌కు తెరప‌డింది. నెల‌లుగా ఆశావాహుల‌ను ఊరిస్తున్న కేబినెట్ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారైంది.

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ‌కు కాంగ్రెస్ హైక‌మాండ్ (Congress high command) ఎట్ట‌కేల‌కు ఆమోద‌ముద్ర వేసింది. ఆదివారం తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ (cabinet expansion) జ‌రుగ‌నుంద‌ని తెలిసింది. కొత్త‌గా ముగ్గురు లేదా న‌లుగురికి అవ‌కాశం ద‌క్క‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే సమయంలో ప్ర‌స్తుత మంత్రుల్లో ఇద్ద‌రికి ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ముగ్గురి పేర్లు ఖరారైన‌ట్లు తెలిసింది. ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్‌, బోధ‌న్ ఎమ్మెల్యే సుద‌ర్శ‌న్‌రెడ్డితో (Bodhan MLA Sudarshan Reddy) పాటు మ‌ల్‌రెడ్డి రంగారెడ్డికి (Malreddy Ranga Reddy) బెర్త్‌ దాదాపు ఖ‌రారైనట్లు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఇద్దరు మంత్రుల‌కు ఉద్వాస‌న ప‌లికితే వారి స్థానంలో ఎవ‌రిని తీసుకోవాల‌న్న దానిపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మంత‌నాలు సాగిస్తున్నారు. ఎవ‌రెవ‌రిని తీసుకోవాలి.. ఏయే శాఖ‌లు కేటాయించాలి.. సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ‌లు త‌దిత‌ర అంశాల‌పై పీసీసీ ముఖ్యుల‌తో పాటు పార్టీ సీనియర్ల‌తో చ‌ర్చిస్తున్నారు. ఇప్ప‌టికే పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌, పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్‌కుమార్‌తో సీఎం కూడిక‌లు, తీసివేత‌ల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు.

Cabinet Expansion | నిరీక్ష‌ణ‌కు తెర‌..

2023 న‌వంబ‌ర్ 7న కాంగ్రెస్ ప్ర‌భుత్వం (Congress government) కొలువుదీరింది. అప్పట్లో కొంత మందికి మాత్ర‌మే మంత్రులుగా అవ‌కాశం ద‌క్కింది. కేబినెట్‌లో ఇంకా ఆరుగురికి అవ‌కాశ‌ముంది. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత పార్టీ అధికారంలోకి రావ‌డంతో చాలా మంది త‌మ‌కు మంత్రిప‌ద‌వి వస్తుంద‌న్న ఆశ‌తో ఉన్నారు. అయితే విస్త‌ర‌ణ‌కు కాంగ్రెస్ అధిష్టానం (Congress high command) గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆశావాహుల‌కు 18 నెల‌లుగా ఎదురుచూపులు త‌ప్ప‌లేదు. ఎట్ట‌కేల‌కు హైక‌మాండ్ అనుమ‌తి ఇవ్వ‌డంతో సీనియ‌ర్ల‌లో ఆశ‌లు రేకెత్తాయి. ఇప్ప‌టికే చాలా మంది ఆశావాహులు కాంగ్రెస్ పెద్ద‌ల వ‌ద్ద లాబీయింగ్ చేసుకున్నారు. వారిలో ఎవ‌రికి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. సామాజిక స‌మీక‌ర‌ణ‌లు, ప్రాంతీయత‌, పార్టీ విధేయ‌త వంటి అంశాలెన్నో కీల‌కం కానున్నాయి.

Cabinet Expansion | ఆ ఎమ్మెల్యేలకు ఖాయ‌మే?

ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు (cabinet expansion) కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌డంతో ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. మంత్రి ప‌ద‌విపై చాలా మంది ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే వారిలో ఎవ‌రికి చాన్స్ దొరుకుతుంద‌న్న‌ది కొద్ది గంటల్లో తేలిపోనుంది. అయితే ఇప్ప‌టికే ముగ్గురి పేర్ల‌కు ఆమోద‌ముద్ర ల‌భించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వేములవాడ ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్‌కు (Adi Srinivas) ప్ర‌మోష‌న్ ఖాయ‌మ‌ని తెలిసింది. ఇక‌, పార్టీ సీనియ‌ర్ నేత, బోధ‌న్ ఎమ్మెల్యే సుద‌ర్శ‌న్‌రెడ్డికి (Bodhan MLA Sudarshan Reddy) కూడా బెర్త్ ఖ‌రారైంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధి నుంచి సీనియ‌ర్ నాయ‌కుడు మ‌ల్‌రెడ్డి రంగారెడ్డికి కూడా చోటు ద‌క్క‌నుంద‌ని తెలిసింది.

అలాగే వీరితో పాటు గ‌తంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చిన వాకాటి శ్రీ‌హ‌రి పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉంది. ఇక మాదిగ సామాజిక వ‌ర్గం నుంచి వివేక్‌కు కూడా చాన్స్ దొరుకుతుంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు, మైనార్టీకి కూడా అవ‌కాశం ల‌భించ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

Cabinet Expansion | సామాజిక‌వ‌ర్గాల కూర్పు..

కేబినెట్ విస్త‌ర‌ణ సంద‌ర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ‌ల‌పై దృష్టి సారించారు. రాష్ట్రంలో బ‌ల‌మైన మున్నూరుకాపుల‌కు మంత్రివ‌ర్గంలో ఇప్ప‌టిదాకా ప్రాతినిధ్యం లేదు. ఈ నేప‌థ్యంలో ఆది శ్రీ‌నివాస్‌కు (Adi Srinivas) ప్ర‌మోష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిసింది. ఇక‌, మ‌రో బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం ముదిరాజ్ నుంచి వాకాటి శ్రీ‌హ‌రి పేరు కూడా దాదాపు ఖ‌రారైన‌ట్లు స‌మాచారం. వీరితో పాటు ఎస్సీ సామాజిక వ‌ర్గం నుంచి మ‌రొక‌రికి చాన్స్ ఉండే అవ‌కాశ‌ముంద‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఇక మైనార్టీతో పాటు గిరిజ‌న సామాజిక‌వ‌ర్గం నుంచి ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుంద‌న్న‌ది ఉత్కంఠ‌గా మారింది. తెలంగాణ కేబినెట్‌లో (Telangana cabinet) ప్ర‌స్తుతం నాలుగు జిల్లాల‌కు ప్రాతినిధ్యం లేదు. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి ఈసారి విస్త‌ర‌ణ‌లో అవ‌కాశం ద‌క్కుతుంద‌ని తెలిసింది. నిజామాబాద్ (Nizamabad) నుంచి సుదర్శ‌న్‌రెడ్డి పేరు ఖ‌రారు కాగా, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధి (Greater Hyderabad area) నుంచి మ‌ల్‌రెడ్డికి చాన్స్ ల‌భిస్తుంద‌ని ప్రచారం జరుగుతోంది.

Cabinet Expansion | వారికి ఉద్వాస‌న?

ప్ర‌స్తుత కేబినెట్‌లో ఉన్న వారిలో ఒక‌రు లేదా ఇద్ద‌రికి ఉద్వాస‌న ప‌లికే అవ‌కాశ‌ముందని సమాచారం. ప‌నితీరుతో పాటు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టిన వారిని మంత్రిమండ‌లి నుంచి తొల‌గిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. బీసీతో పాటు వెల‌మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు మంత్రుల‌ను త‌ప్పించ‌నున్న‌ట్లు తెలిసింది. వారి స్థానంలో ఆయా సామాజిక‌వ‌ర్గాల వారికి అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు స‌మాచారం. అదే జ‌రిగితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మ‌ద‌న్‌మోహ‌న్‌రావుకు (Yellareddy MLA Madanmohan Rao) చాన్స్ దొరుకుతుంద‌ని ఆయ‌న వ‌ర్గీయులు చెబుతున్నారు.