అక్షరటుడే, వెబ్‌డెస్క్: Delhi | ఢిల్లీలోని ఎన్సీఆర్ (Delhi NCR) పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) గతంలో తీర్పునిచ్చింది. దీనిపై పిటిషన్లు దాఖలయ్యాయి.
దీపావళి పండుగ కోసం పిల్లలు ఎదురు చూస్తారని.. గ్రీన్ క్రాకర్స్‌తో వారిని పండుగ చేసుకోవడానికి అనుమతించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ క్రాకర్స్ (Green Fire crackers) వినియోగానికి అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది.
‘స్మగ్లింగ్ చేసిన క్రాకర్స్‌ను వాడడం వల్ల గ్రీన్ క్రాకర్స్ వినియోగించిన దానికంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. అందుకే ఈ పరిస్థితులను సమతుల్యం చేసేలా చర్యలు ఉండాలి. పర్యావరణానికి హాని కలగకుండా మితంగా వాడేందుకు అనుమతిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు తీర్పు నేపథ్యంలో అందరి దృష్టి గ్రీన్ క్రాకర్స్‌పై పడింది. అసలు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమిటి, సాధారణ బాణాసంచాకు దీనికి తేడా ఏమిటి అన్న విషయం తెలుసుకుందామా..
గ్రీన్ క్రాకర్స్ చూడడానికి మామూలు బాణాసంచాలాగే ఉంటుంది. అయితే పొగ, శబ్దాలు తక్కువగా ఉంటాయి. సాధారణ బాణాసంచా ఎక్కువ స్థాయిలో నైట్రోజన్, సల్ఫర్ (Sulphur) వాయువులను విడుదల చేస్తాయి. గ్రీన్ క్రాకర్స్ అందులో సగం కూడా నష్టం చేయవు. నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NEERI) సంస్థ వీటిని తయారు చేసింది. మామూలు టపాసుల్లో ఉండే ప్రమాదకరమైన రసాయనాలకు బదులు, వీటిలో జియోలైట్, ఐరన్ ఆక్సైడ్ లాంటి తక్కువ ప్రమాదకరమైన పదార్థాలు వినియోగిస్తారు.
వీటి తయారీలో అంటిమోని, లిథియమ్, మెర్క్యురీ (Mercury), ఆర్సెనిక్, లెడ్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉపయోగించరు. ఇవి మామూలు టపాసులకంటే చిన్న సైజులో ఉంటాయి. తయారు చేయడానికి తక్కువ ముడి సరుకులు వాడతారు. వీటిని కాల్చాక ఎక్కువ బూడిద ఉండదు. కాలుష్యాన్ని తగ్గించేందుకు వీటిలో కొన్ని పదార్థాలను కలుపుతారు. దీనివల్ల గాలిలోకి వచ్చే దుమ్ము (కణ పదార్థం), సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ (Nitrogen dioxide) లాంటివి తగ్గుతాయి. ఇవి తక్కువ పొగ, తక్కువ శబ్దం చేస్తాయి. సాధారణ బాణాసంచాకన్నా గ్రీన్ కాకర్స్ 30 శాతం తక్కువ వాయు కాలుష్యాన్ని విడుదల చేస్తాయి.
Delhi | గ్రీన్ కాకర్స్ రకాలు..
సేఫ్ వాటర్ అండ్ ఎయిర్ రిలీజర్ : ఇవి చిన్న నీటి తుంపరలను విడుదల చేస్తాయి. ఆ తుంపరలు గాలిలో ఉండే దుమ్మును పీల్చుకుంటాయి.
సేఫ్ మినిమల్ అల్యూమినియం : వీటిలో అల్యూమినియం (Aluminium) తక్కువ మోతాదులో ఉంటుంది. ఇవి చాలా తక్కువ శబ్దం చేస్తాయి.
సేఫ్ థర్మైట్ క్రాకర్ : వీటిలో పొటాషియం నైట్రేట్, సల్ఫర్ ఉండవు కాబట్టి వీటి నుంచి పొగ తక్కువగా వస్తుంది.