అక్షరటుడే, కోటగిరి : Pothangal | జాగా ఖాళీగా కనిపిస్తే చాలు.. కబ్జా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వస్తే.. అధికారులు అందుబాటులో ఉండరనే ఉద్దేశంతో దర్జాగా షెడ్లు వేసేసి కబ్జాకు శ్రీకారం చుడుతున్నారు.
పోతంగల్(Pothangal) మండల కేంద్రంలోని ఓ స్థలంలో సెలవురోజుల్లో వేసిన స్తంభాలను, రేకులషెడ్లను అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బందితో తొలగించారు. సర్వే చేసి హద్దులు నిర్ణయించేవరకు ఎవరు కూడా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయవద్దని ఈ సందర్భంగా తహశీల్దార్ గంగాధర్(Tahsildar Gangadhar) హెచ్చరించారు. దసరా పండుగ తర్వాత 171, 172, 173 సర్వే నంబర్లలో సర్వే చేయించి హద్దులు నిర్ణయిస్తామని పేర్కొన్నారు. సర్వే అయ్యేంతవరకు ఎవరు కూడా నిర్మాణాలు చేపట్టరాదని హెచ్చరించారు. ఆయన వెంట సర్వేయర్ పోశెట్టి, ఆర్ఐ సయ్యద్ హుస్సేన్, ఏఎస్సై బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.