అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gram Panchayat election | తెలంగాణలో గురువారం తొలి విడత పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ.. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తొలి విడత ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఓ సర్పంచి కేవలం ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించగా.. అదే జిల్లాలో కొడుకు సర్పంచిగా గెలిచిన ఆనందంలో తల్లి గుండె ఆగింది. ఇక రాజన్న సిరిసిల్లా జిల్లాలో చనిపోయిన అభ్యర్థి సర్పంచిగా గెలిచారు.
Gram Panchayat election | పోలింగ్ డబ్బాలో వేసి వెనుదిరిగిన వెంటనే
తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. బ్యాలెట్ పేపర్‌ను పోలింగ్ డబ్బాలో వేసి వెనుదిరిగిన వెంటనే ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో చెరుపల్లి బుచ్చయ్య(69) గురువారం ఉదయం ఓటు వేసేందుకు వచ్చారు.
పోలింగ్ రూంలోకి వెళ్లి ఓటు వేసి ఆవరణలోనే స్పృహ కోల్పోయాడు. గమనించిన అక్కడున్నవారు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా.. బుచ్చయ్య తనువు చాలించారు. కాగా, సదరు వృద్ధుడు 20 రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.