అక్షరటుడే, వెబ్డెస్క్: Gram Panchayat election | తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. తొలి విడత 189 మండలాల్లో పోలింగ్ జరిగింది. ఈ విడతలో 4,236 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వీటిల్లో 395 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ క్రమంలో మిగతా 3,834 గ్రామ పంచాయతీల్లో గురువారం తొలి విడత పోలింగ్ పూర్తయింది. ఇక వార్డు సభ్యుల విషయానికి వస్తే.. 9,633 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో 84.28 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది. తొలి విడత పంచాయతీ ఎలక్షన్లో 45,15,141 మంది ఓటర్లు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
గురువారం వెల్లడైన ఫలితాల ప్రకారం.. 1830 మంది కాంగ్రెస్ సర్పంచి అభ్యర్ధులు గెలుపొందారు. ఇక భారాస విషయానికి వస్తే.. 921 సర్పంచి అభ్యర్ధులు, 149 BJP సర్పంచి అభ్యర్ధులు, 410 మంది ఇతరులు గెలుపొందారు.
Gram Panchayat election | నిజామాబాద్ జిల్లాలో
నిజామాబాద్ జిల్లాలో తొలి విడత 184 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. 132 పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, 15 చోట్ల బీజేపీ అభ్యర్థులు, 15 సర్పంచి స్థానాల్లో భారాస బలపర్చిన అభ్యర్థులు, మరో నలుగురు జాగృతి బలపర్చిన అభ్యర్థులు, 18 మంది ఇతరులు సర్పంచులుగా విజయం సాధించారు.