అక్షరటుడే, వెబ్డెస్క్: Gram Panchayat election | తొలి విడత ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఓ సర్పంచి కేవలం ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించగా.. అదే జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు సర్పంచిగా గెలిచిన ఆనందంలో తల్లి గుండె ఆగింది. ఇక మరో విషయం ఏమిటంటే చనిపోయిన అభ్యర్థి సర్పంచిగా గెలిచారు. ఈ ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లాలో చోటుచేసుకుంది.
Gram Panchayat election | నామినేషన్ వేశాక..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా RR కాలనీ సర్పంచి ఎన్నికల్లో చర్ల మురళి అనే అభ్యర్థి పోటీ చేశారు. కాగా, నామినేషన్ వేసిన తర్వాత ఆయన మరణించారు.
ఆయన మరణం గ్రామస్థులను కలచివేసింది. అంత్యక్రియలకు వందలాది గ్రామస్థులు తరలొచ్చారు. ఆయనపై అభిమానాన్ని చూపుతో గ్రామస్థులు ఆయనకే ఓటు చేశారు. దీంతో మురళి తన సమీప ప్రత్యర్థి కంటే 300కుపైగా ఓట్ల ఆధిక్యం అందుకున్నారు.
అయితే, ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు. సర్పంచి ఎవరనేది ప్రకటించలేదు. ఏమి చేయాలో అర్థం కాకపోవడంతో, విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.