అక్షరటుడే, భీమ్‌గల్ : AIUKS | మండల పరిధిలో ఇంకా రోడ్లపైనే ఉన్న వరిధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు జరపాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి.దేవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏఐయూకేఎస్ బృందం ఆదివారం భీమ్‌గల్ మండలంలోని (Bheemgal Mandal) తాళ్లపల్లి, గంగరాయి, కొత్తపల్లి, రహత్ నగర్, దేవక్కపేట్, కారేపల్లి తదితర గ్రామాల పరిధిలో రోడ్లపై ఉన్న ధాన్యం కుప్పలను పరిశీలించింది. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎలాంటి అదనపు తరుగు లేకుండా తక్షణమే రోడ్లపై ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వారు కోరారు. రోడ్లపై నిలిచిన ధాన్యమంతా దొడ్డు ధాన్యం కావడంతో రైస్ మిల్లుల యజమానులు తీసుకునేందుకు ససేమిరా అంగీకరించడం లేదని వారు పేర్కొన్నారు.
AIUKS | అదనపు తరుగు బాదుడు..
కొనుగోలు కేంద్రాల వద్ద 40 కిలోల సంచికి ఒకటిన్నర కిలోల వరకు అదనపు తరుగు తీసుకుంటున్నారన్నారు. రైస్ మిల్లుల (Rice Mills) వద్దకు వెళ్లిన తర్వాత ధాన్యం బాలేదనే సాకుతో సెటిల్మెంట్ పేరుతో రైతులకు సంబంధం లేకుండానే క్వింటాలుకు 5 కిలోలకు పైగా అదనపు తరుగు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న సహకార సంఘాల సీఈవోలు, ఐకేపీ సిబ్బంది రైస్ మిల్లు యజమానులతో కుమ్మక్కై రైతులను (Farmers) నిండా ముంచుతున్నారని వారు ఆరోపించారు.
ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. అకాల వర్షాలు కురిసి, గిరిజన తండాలకు చెందిన ధాన్యం తడిసి ముద్దయితే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. రోడ్లపై ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించాలని వారు కోరారు. అధికారులపై, రైస్‌మిల్లుల యజమానులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను వారు డిమాండ్‌చేశారు. సమావేశంలో ఏఐయూకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాజన్నగారి బాబన్న, జిల్లా కార్యదర్శి కిషన్, సీపీఐఎంఎల్ మాస్‌లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు కె.రాజేశ్వర్, జిలకర నడిపన్న, ఎం. నరేందర్ తదితరులు పాల్గొన్నారు.