అక్షరటుడే, బాన్సువాడ: Nizamabad Collector | జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా చేపట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna reddy) అధికారులను ఆదేశించారు. మోస్రా, చందూర్, వర్ని మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను రిజిస్టర్లలో స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు. రైతులకు రసీదులు ఇవ్వాలని, ట్రక్ షీట్లు (Truck sheets) వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు చేయడం ద్వారా బిల్లులు సకాలంలో చెల్లించగలుగుతామని చెప్పారు.
కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, మాయిశ్చర్ మీటర్లు (Moisture meters), తూకం యంత్రాలు, టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని, హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లారీల కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు.
రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్ ధాన్యాన్ని బాగా ఆరబెట్టి శుభ్రపర్చి కేంద్రాలకు తీసుకువస్తే పూర్తి మద్దతు ధర లభిస్తుందని సూచించారు. ఖరీఫ్‌లో జిల్లాలో మొత్తం 670 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 300 వరకు కేంద్రాలు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. ధాన్యం కోతలు పూర్తవుతున్న ప్రాంతాల్లో తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
మొక్కజొన్న పంట సాగు చేసిన ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సివిల్ సప్లయ్స్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, సహకార శాఖ అధికారి అంబర్ సింగ్, వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ కులకర్ణి సురేష్ తదితరులు పాల్గొన్నారు.