అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | దేశంలోని వేగంగా విస్తరిస్తున్న మెట్రో నగరాల్లో హైదరాబాద్ (Hyderabad) ఒకటి. జనాభా, వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో నగర రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana government) కీలక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ‘మహా మెట్రో’ పేరుతో ప్రతిపాదించిన కొత్త మెట్రో ప్రాజెక్ట్ (new metro project) హైదరాబాద్ రూపురేఖలను పూర్తిగా మార్చబోతోంది.
ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని 360 డిగ్రీల వలయాకారంలో మెట్రో రైలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనపై ప్రభుత్వం గంభీరంగా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) చేసిన ప్రకటనతో ఈ ప్రాజెక్ట్‌పై నగరవాసుల్లో విస్తృత చర్చ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధి 2,071 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించడంతో, రోజూ వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి లక్షలాది మంది నగరంలోకి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్డుపై (Outer Ring Road) మెట్రో అందుబాటులోకి వస్తే, నగర కేంద్రంలోకి వాహనాల రద్దీ గణనీయంగా తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Hyderabad | ఇక ట్రాఫిక్ సమస్య ఉండదు..
ఈ వలయాకార మెట్రో ప్రత్యేకత ఏమిటంటే, జాతీయ రహదారుల ద్వారా వచ్చే ప్రయాణికులు నగర శివార్లలోనే తమ వాహనాలను పార్క్ చేసి, మెట్రోలోకి Metro మారే సౌకర్యం లభించనుంది. దీని వల్ల ట్రాఫిక్ సమస్యలతో పాటు ఇంధన వినియోగం, వాయు కాలుష్యం కూడా తగ్గే అవకాశముంది. అంతేకాదు, ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కొత్త వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు ఏర్పడేందుకు ఇది దోహదపడుతుందని అంచనా. భూసేకరణ సమస్య లేకపోవడం ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన బలంగా మారింది.
గతంలోనే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుల మధ్యలో రీజినల్ రింగ్ రైల్ కోసం 25 మీటర్ల వెడల్పుతో స్థలం కేటాయించడంతో, ఇప్పుడు అదే మార్గంలో మెట్రో నిర్మాణం చేపట్టవచ్చు. దీనివల్ల న్యాయపరమైన అడ్డంకులు, ప్రజల నిరసనలు లేకుండా పనులు వేగంగా పూర్తయ్యే అవకాశముంది. ఇప్పటికే అధికారులు డీపీఆర్ తయారీ పనులను ముమ్మరం చేసినట్లు సమాచారం.
ఇంకో కీలక అంశం ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న 22 ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద మెట్రో స్టేషన్ల ఏర్పాటు. భవిష్యత్తులో ఈ సంఖ్య 25కి పెరిగే అవకాశం ఉండటంతో, ప్రతి ఇంటర్‌ఛేంజ్ ఒక మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్‌గా మారనుంది. స్కైవాక్‌లు, భారీ పార్కింగ్ సదుపాయాలు, రైల్వే స్టేషన్లతో అనుసంధానం వంటి సౌకర్యాలతో ప్రయాణికులకు Passengers అంతర్జాతీయ స్థాయి అనుభవం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. ఈ ‘మహా మెట్రో’ ప్రాజెక్ట్ కార్యరూపం దాలిస్తే, హైదరాబాద్ రవాణా రంగంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని, నగరం ప్రపంచస్థాయి మెట్రోపాలిటన్ సిటీల సరసన నిలుస్తుందని పట్టణాభివృద్ధి నిపుణులు చెబుతున్నారు.