అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mir Alam Tank | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మీర్ ఆలం చెరువుపై (Mir Alam Tank) వంతెన నిర్మాణానికి రూ.430 కోట్లు మంజూరు చేస్తూ గురువారం పరిపాలన అనమతులు జారీ చేసింది.
మెట్రోపాలిటన్ ఏరియా మరియు అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD)- మూసి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్( MRDCL) ఆధ్వర్యంలో మీరం ఆలం ట్యాంక్‌పై వంతెన (Bridge) నిర్మించనున్నారు. ఈపీసీ (EPC) మోడల్లో శాస్త్రిపురం వద్ద బెంగళూరు జాతీయ రహదారి నుంచి చింతల్‌మెట్ రోడ్డుకు అనుసంధానించేలా నిర్మించనున్న ఈ ఐకానిక్ బ్రిడ్జి కోసం ప్రభుత్వం రూ.430 కోట్లు కేటాయించింది. ఈ మేరకు పారిపాలన అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
వంతెన నిర్మాణం కోసం సంబంధిత నిధులను మూసి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు బదిలీ చేయనున్నారు. వంతెన కోసం భూములు, ఆస్తులు స్వాధీనం చేసుకొని టెంటర్లు పిలిచే బాధ్యతను కూడా ఎంఆర్డీసీఎల్కు అప్పగించారు. ఈపీసీ మోడ్‌లో ఈ బ్రిడ్జి నిర్మించనున్నారు.
Mir Alam Tank | చెరువు అభివృద్ధికి చర్యలు
నగరంలోని మీరం ఆలం చెరువు అభివృద్ధికి చర్యలు చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) గతంలో ప్రకటించారు. పాత బస్తీ (Old City) సమీపంలోని మీరం ఆలం చెరువులో కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మిస్తామని గతంలో సీఎం తెలిపారు. ఈ మేరకు తాజాగా వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించడం గమనార్హం. ఇప్పటికే నగరంలో దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి ఉంది. అయితే ఓల్డ్ సిటీ, న్యూ సిటీ మధ్య కనెక్టివిటీ పెంచేందుకు మీరం ఆలం చెరువుపై ప్రభుత్వం వంతెన నిర్మాణం చేపట్టనుంది. 2.65 కిలోమీటర్ల మేర నాలుగు లేన్లతో ఐకానిక్ వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. తాజాగా నిధులు మంజూరు చేయడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.