అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Adilabad Airport | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ విమానాశ్రయం కోసం భూ సేకరణకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సోమవారం జీవో జారీ చేసింది.
ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సమన్వయంతో ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధి కోసం 700 ఎకరాల సేకరణకు ఆమోదం తెలిపింది. AAI యొక్క సాధ్యాసాధ్యాల నివేదిక ఆచరణీయతను నిర్ధారించింది, భూసేకరణ (Land acquisition) చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ (Vikas Raj) ఉత్తర్వులు జారీ చేశారు.
Adilabad Airport | వేగంగా అడుగులు
తెలంగాణలో వరంగల్ (Warangal), ఆదిలాబాద్ (Adilabad)లలో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను రెండేళ్లలో అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తోంది. ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు ఏర్పాటు కోసం ఏప్రిల్‌లో భారత వాయుసేన (IAF) పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ప్రయాణికులు/ఐఏఎఫ్ విమానాలు తిరిగేందుకు వీలుగా విమానాశ్రయం నిర్మించనున్నారు. తాజాగా భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పనులు ప్రారంభించనుంది.
వరంగల్ మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ సైతం వేగంగా సాగుతోంది. 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే విడుదల చేసింది. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులను 2027 జూన్ నాటికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్రాన్ని సైతం కోరింది. అయితే 2027 డిసెంబర్‌లోపు పనులు పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
