అక్షరటుడే, వెబ్డెస్క్ : BC Reservations | బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో సీఎం రిజర్వేషన్ల అంశంపై చర్చించారు. అనంతరం బీసీ రిజర్వేషన్ల(BC Reservations) కోసం జీవో విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సాయంత్రం వరకు జీవో విడుదల చేసే అవకాశం ఉంది. అనంతరం ఒకటి రెండు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు(Local Body Elections) ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుందని సమాచారం.
BC Reservations | నిరీక్షణకు తెరపడేనా..
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ మేరకు బీసీ బిల్లులు అసెంబ్లీలో ఆమోదించింది. అయితే వాటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయలేదు. దీంతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. గ్రామాలకు సర్పంచులు లేక ఏడాదిన్నర దాటి పోయింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం అయిపోయి కూడా ఏడాది గడుస్తోంది. దీంతో స్థానిక ఎన్నికల కోసం నాయకులు, ప్రజలు నెలలుగా నిరీక్షిస్తున్నారు. అయితే బీసీ బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండటంతో ప్రత్యేక జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.
BC Reservations | సిద్ధంగా యంత్రాంగం
స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం(Election Commission) ప్రకటించింది. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితాను ఇప్పటికే ప్రచురించారు. జిల్లా స్థాయిలో రిజర్వేషన్ల జాబితాను సిద్ధం చేశారు. దీంతో జీవో రాగానే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అనంతరం ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది.