అక్షరటుడే, వెబ్డెస్క్:Hyderabad | ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఆదాయం తగ్గిపోవడంతో పాటు ఖర్చులు భారీగా పెరిగాయి. సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగుల జీతాలకు భారీగా ఖర్చు అవుతుండటంతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం(Government) ఆదాయం పెంచుకునే మార్గాలపై అన్వేషణ మొదలు పెట్టింది. ఇప్పటికే మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Hyderabad | జీహెచ్ఎంసీ పరిధిలో..
ప్రస్తుతం ప్రభుత్వం ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ పన్నులు వసూలు చేస్తోంది. ఇక నుంచి ఖాళీ స్థలాలకు కూడా పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో ఖాళీ స్థలానికి కూడా పన్ను వసూలు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఖాళీ ప్లాట్‌లలో జీహెచ్ఎంసీ సిబ్బంది బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఎలాంటి నిర్మాణం జరగకుండా ఖాళీ ప్లాట్ ఉన్నప్పటికీ, జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 212(2) మేరకు వేకెంట్ ల్యాండ్ టాక్స్ (Vacant Land Tax) చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది. సదరు ల్యాండ్ మార్కెట్ వ్యాల్యూలో 0.05 శాతం వీఎల్‌టీ చెల్లించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. దీంతో జీహెచ్ఎంసీ అదనంగా రూ.110 కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.