Homeతాజావార్తలుRTA Chek Posts | ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్​పోస్టుల మూసివేత

RTA Chek Posts | ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్​పోస్టుల మూసివేత

రాష్ట్రంలోని ఆర్టీఏ చెక్​పోస్టులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాయంత్రం ఐదు గంటలలోపు చెక్​పోస్టులను మూసివేయాలని రవాణా శాఖ కమిషనర్​ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTA Chek Posts | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ చెక్​పోస్టులను తొలగించింది. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్​ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలోని చెక్​పోస్టుల్లో భారీగా అవినీతి జరుగుతోంది. ఇటీవల ఏసీబీ అధికారులు పలుమార్లు ఆర్టీఏ చెక్​పోస్టుల (RTA Chek Posts)పై దాడులు చేపట్టి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం చెక్​పోస్టులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. చెక్​పోస్టుల ద్వారా ప్రస్తుతం ఇస్తున్న అనుమతులు ఇక నుంచి ఆన్​లైన్​లో ఇవ్వనుంది. చెక్​పోస్టుల్లో పని చేస్తున్న సిబ్బంది బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోపు వాటిని మూసి వేసి, ఆర్టీఏ కార్యాలయాల్లో రిపోర్ట్​ చేయాలని కమిషనర్​ ఆదేశించారు.

RTA Chek Posts | తక్షణమే మూసివేయాలి

రాష్ట్రంలో చెక్ పోస్టుల మూసివేత తక్షణమే అమలులోకి వస్తుందని కమిషనర్​ (Transport Commissioner) ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేగాకుండా అధికారులు ఆయన పలు సూచలను చేశారు. జిల్లా రవాణా అధికారి/DTC తన సమక్షంలో చెక్ పోస్ట్ అన్ని బోర్డులు, బారికేడ్లను తొలగించి, చెక్ పోస్ట్ మూసివేయాలి. వాహన నిర్వాహకులకు ఆన్‌లైన్ సేవల గురించి అవగాహన కల్పించేలా బోర్డులను ఏర్పాటు చేయాలి. చెక్ పోస్టుల వద్ద ప్రస్తుతం నియమించిన సిబ్బంది అందరినీ సంబంధిత డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌కు తిరిగి పంపించాలి. వాహనాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేలా చెక్ పోస్ట్ సైట్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లు, సైనేజ్‌లను తొలగించాలి. మొత్తం తొలగింపు ప్రక్రియను వీడియోగ్రాఫ్ చేయాలి. ఆయా చెక్​పోస్టుల్లోని రికార్డులు, ఫర్నిచర్, పరికరాలు, కంప్యూటర్లు చరాస్తులను వెంటనే డీటీవో కార్యాలయానికి తరలించాలని కమిషనర్​ ఆదేశించారు.

RTA Chek Posts | అవినీతి పెరగడంతో..

రాష్ట్రంలోని ఆర్టీఏ చెక్​పోస్టులు అవినీతికి అడ్డాలుగా మారాయి. ఆర్టీఏ అధికారులు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. వాహనాల డ్రైవర్లు, యజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అవినీతిపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు (ACB Officers) చెక్​పోస్టులపై పలుమార్లు దాడులు చేపట్టారు. అయినా అధికారులు తమ తీరు మార్చుకోలేదు. ప్రైవేట్​ ఏజెంట్లను పెట్టుకొని మరి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఏసీబీ అధికారులు 12 ఆర్టీఏ చెక్​పోస్టులపై దాడులు చేపట్టారు. లెక్కల్లో చూపని రూ.4,18,880 నగదు స్వాధీనం చేసుకున్నారు. గతంలో సైతం భారీగా నగదు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం చెక్​పోస్టులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

RTA Chek Posts | ఆన్​లైన్​లో సేవలు

ప్రస్తుతం చెక్​పోస్టుల ద్వారా అందిస్తున్న సేవలను ఇక నుంచి ఆన్​లైన్​లో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అవినీతికి అడ్డుకట్ట పడటంతో పాటు వాహనదారులకు మేలు జరుగుతుంది. అంతర్రాష్ట్ర అనుమతులకు సంబంధించిన సేవలు సైతం ఆన్​లైన్​లో పొందాలని అధికారులు పేర్కొన్నారు. ఇకపై చెక్​పోస్టు సేవలను www.transport.telangana.gov.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చని సూచించారు. ఈ మేరకు వాహనదారులకు అవగాహన కల్పించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.