అక్షరటుడే, వెబ్‌డెస్క్: Arogya Sri | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి, కార్డుల్లో నూతనంగా చేరిన వారికి ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కొత్త రేషన్‌కార్డులు జారీ చేయలేదు. దీంతో ఆరోగ్యశ్రీ (Arogya Sri) సేవలు అందక చాలా మంది ఇబ్బందిపడ్డారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు (New Ration Card) జారీ చేయలేదు. అలాగే పాత కార్డుల్లో కుటుంబ సభ్యులను యాడ్ చేసే అవకాశం కూడా కల్పించలేదు. దీంతో పెళ్లయిన మహిళల పేరు అత్తింటివారి రేషన్‌కార్డులో ఎక్కలేదు. అలాగే పిల్లలు పేర్లు సైతం యాడ్ కాలేదు. దీంతో వారికి ఆరోగ్యశ్రీ సేవలు ఇన్ని రోజులు అందలేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కుటుంబ సభ్యులను యాడ్ చేయడంతో, కొత్త కార్డులను కూడా మంజూరు చేసింది.
Arogya Sri | ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా..
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రేషన్ కార్డుల్లో పేరున్న వ్యక్తులకు ఆరోగ్యశ్రీ సేవలు (Arogya Sri Services) అందిస్తున్నారు. రాష్ట్రంలో జనవరి 1 నాటికి 89,95,282 రేషన్‌కార్డులు ఉండగా, 2.81 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వీరందరికి ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) జనవరి 26 నుంచి రాష్ట్రంలో కొత్త కార్డుల జారీతో పాటు కుటుంబ సభ్యుల నమోదు చేసింది. దీంతో కొత్తగా 6 లక్షల కార్డులు జారీ చేశారు.
మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.10 కోట్లకు చేరింది. దీంతో కొత్తగా రేషన్‌కార్డుల్లో పేరు ఎక్కిన వారికి ఆరోగ్యశ్రీ వర్తింపజేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్తగా రేషన్‌కార్డుల్లో నమోదైన 30 లక్షల మంది వివరాలను ఆరోగ్యశ్రీ పోర్టల్‌లో (Arogya Sri Portal) నమోదు చేయాలని మంత్రి దామోద రాజనర్సింహ (Minister Damoda Rajanarsimha) ఆదేశించారు. దీంతో అధికారులు వారి వివరాలు నమోదు చేస్తున్నారు.
Arogya Sri | వారికి ఎంతో మేలు
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల్లో (Corporate Hospitals) ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. పలురకాల చికిత్సలకు దీని ద్వారా వైద్యం చేస్తున్నారు. గతంలో రూ.5 లక్షల వైద్య ఖర్చులు ఉచితంగా ఉండగా.. కాంగ్రెస్ వచ్చాక ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. అయితే రాష్ట్రంలో దాదాపు 2016 నుంచి కొత్త రేషన్ కార్డులు లేవు. ఆ తర్వాత పుట్టిన పిల్లల పేర్లు ఇప్పుడే కార్డుల్లో ఎక్కాయి. ఇన్నాళ్లు వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే తల్లిదండ్రులు ఆరోగ్యశ్రీ వర్తించక అనేక ఇబ్బందులు పడేవారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో వారికి కూడా ఆరోగ్య శ్రీ అందుబాటులోకి రానుంది.