HomeజాతీయంCough Syrup | ఔషధాల నాణ్యతపై ప్రభుత్వం దృష్టి.. నూతన చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో కేంద్రం

Cough Syrup | ఔషధాల నాణ్యతపై ప్రభుత్వం దృష్టి.. నూతన చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో కేంద్రం

Cough Syrup | దగ్గు మందు కారణంగా ఇటీవల 40 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఫార్మా ఉత్పత్తుల తనిఖీలను కఠినతరం చేయాలని కేంద్రం భావిస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cough Syrup | ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ఔషధ కంపెనీలకు ముకుతాడు వేయాలని కేంద్ర ప్రభుత్వం (central government) భావిస్తోంది. దగ్గుమందు (cough syrup) కారణంగా ఇటీవల 40 మందికి పైగా చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో కేంద్రం పునరాలోచనలో పడింది.

వైద్య ఉత్పత్తులకు (medical products) కఠినమైన సమ్మతి కోసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఔషధాల నాణ్యతా తనిఖీల కోసం నూతన చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. వైద్య పరికరాలు, సౌందర్య సాధనాల నియంత్రణతో పాటు ఔషధ నాణ్యత పరీక్షలు, మార్కెట్ నిఘా కోసం చట్టపరమైన చట్రాన్ని బలోపేతం చేసేందుకు ఒక చట్టాన్ని రూపొందించాలని భావిస్తోంది.

Cough Syrup | పదేపదే ఫిర్యాదులు..

భారతీయ ఔషధ పరిశ్రమల్లో (Indian pharmaceutical industry) తీవ్రమైన నాణ్యతా లోపాలు పదేపదే బయటపడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నియంత్రణ సంస్థలు పదేపదే మన ఔషధాల నాణ్యతపై ఫిర్యాదులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కీలక ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.

రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్న ‘ఔషధాలు, వైద్య పరికరాలు, సౌందర్య సాధనాల చట్టం 2025’ ముసాయిదాను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) డాక్టర్ రాజీవ్ రఘువంశీ సమర్పించారు. ప్రతిపాదిత చట్టం గురించి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సీనియర్ అధికారులు వివరించారు.

Cough Syrup | కీలక అధికారాలు వారి చేతికి..

ప్రతిపాది ముసాయిదా చట్టం అమలులోకి వస్తే.. దేశీయ వినియోగం, ఎగుమతి రెండింటికీ భారతదేశంలో తయారు చేయబడిన మందులు, వైద్య పరికరాలు, సౌందర్య సాధనాల కఠినమైన నాణ్యత తనిఖీలు, నిఘాను నిర్ధారించడానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ చట్టబద్ధమైన అధికారాన్ని దాఖలు చేస్తుంది.

కొత్త చట్టం ప్రకారం, నకిలీ లేదా నాసిరకం మందులపై తక్షణ చర్య తీసుకోవడానికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అధికారులకు మొదటిసారిగా చట్టబద్ధమైన అధికారాలు లభిస్తాయి. లైసెన్సింగ్ ప్రక్రియను డిజిటలైజ్ చేయడం, రాష్ట్ర స్థాయి నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం, పరీక్షా ప్రయోగశాల సామర్థ్యాలను అప్గ్రేడ్ చేయడం వంటి నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయి.

ప్రస్తుతం అమలులో ఉన్న 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టాన్ని (Drugs and Cosmetics Act) మార్చుతూ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు. తయారీ నుంచి మార్కెట్ పంపిణీ వరకు ప్రతి దశలోనూ జవాబుదారీతనం, పారదర్శకతను నిర్ధారించడమే లక్ష్యంగా కఠిన నిబంధనలు రూపొందిస్తున్నారు.