అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Degree Colleges | ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో రెండు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల (Govt Degree Colleges)ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జగిత్యాల జిల్లా ధర్మపురి (Dharmapuri)తో పాటు, కరీంనగర్ జిల్లా గంగాధర (Gangadhara) మండల కేంద్రాల్లో నూతన డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా (Yogitharana) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Degree Colleges | విద్యార్థుల ఇబ్బందులు
జగిత్యాల (Jagityal) జిల్లాలోని ధర్మపురిలో ప్రస్తుతం డిగ్రీ కాలేజీ లేదు. దీంతో విద్యార్థులు ఉన్నత చదువుల కోసం కరీంనగర్, జగిత్యాలకు వెళ్తున్నారు. అయితే దూరభారంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో సైతం డిగ్రీ కాలేజీ లేక పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్‌కు వెళ్లి చదువుకుంటున్నారు.
దూరం ఎక్కువ కావడంతో చాలా మంది అమ్మాయిలు ఇంటర్‌తోనే చదువు మానేస్తున్నారు. దీంతో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని కొంతకాలంగా నాయకులు, ప్రజలు కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ధర్మపురి, గంగాధరలో కళాశాలలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతన కాలేజీలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీంతో ఆయా మండలాలతో పాటు సమీప మండలాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.