అక్షరటుడే, వెబ్డెస్క్ : Kavitha | బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఎనాడు జై తెలంగాణ అనని రేవంత్రెడ్డి(CM Revanth Reddy) బతుకమ్మ నిమజ్జనంలో పాల్గొనడం మంచి పరిణామమే అని కవిత అన్నారు. అయితే గిన్నిస్ రికార్డు కోసం బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) జరపడంపై ఆమె విమర్శలు చేశారు. గతంలో తాము కోటి బతుకమ్మల జాతర చేశామన్నారు. కానీ రికార్డుల కోసం చేయలేదన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం పండుగకు బతుకమ్మ చీరలు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. వచ్చే ఏడాది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో లక్ష మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామన్నారు. అన్నింటా తాను పేరు ఉండాలని సీఎం రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
Kavitha | ఎస్సీ వర్గీకరణ ఏమైంది?
బీసీ రిజర్వేషన్లపై(BC Reservations) తెలంగాణ జాగృతి ఎప్పటి నుంచో పోరాటం చేస్తుందని కవిత అన్నారు. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల చేయగానే కాంగ్రెస్ నాయకులు కోర్టులో కేసు వేశారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల వారీగా కులగణన వివరాలు బయట పెట్టాలని కవిత(Kavitha) డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. బీసీ బిల్లు అమలు చేశాక ఎన్నికలు నిర్వహిస్తే న్యాయపరంగా చిక్కులు ఉండవన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే కోర్టు తీర్పు తర్వాత జాగృతి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామన్నారు.
Kavitha | ఈటల వ్యాఖ్యలపై ఆగ్రహం
స్థానిక ఎన్నికలపై ఇటీవల బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Eatala Rajender) చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. బీజేపీ ఎంపీలు మోదీని ఒప్పించి బీసీ రిజర్వేషన్లు అమలు చేయించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఈటల మాట్లాడుతూ.. అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని సూచించారు. కోర్టు ఎన్నికలను రద్దు చేస్తే నష్టపోతారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులను తప్పుదోవ పట్టించేలా ఈటల మాట్లాడారని అన్నారు.
Kavitha | ఓటర్లు లేకున్నా రిజర్వేషన్..
స్థానిక ఎన్నికల్లో(Local Body Elections) కొన్ని గ్రామాల్లో ఆ కులానికి సంబంధించిన ఓటర్లు లేకున్నా సీట్లను రిజర్వ్ చేశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ఆమె ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామంలో ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిందన్నారు. అయితే ఆ గ్రామంలో ఎస్సీలే లేరని వ్యాఖ్యానించారు. పెద్దకొడప్గల్ మండలం దావునితండాను సైతం ఎస్సీలకు రిజర్వ్ చేశారన్నారు. అక్కడ కూడా ఎస్సీలు లేరని చెప్పారు. మాచారెడ్డి మండలం వడ్డెరగూడెంలో సర్పంచ్ పదవిని ఎస్సీకి రిజర్వ్ చేశారన్నారు. అక్కడ అందరూ బీసీలే ఉన్నారని తెలిపారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం తక్కళపల్లిలో ఎస్టీ ఓటర్లు ఇద్దరే ఉన్నారని చెప్పారు. అయితే రెండు వార్డులు, ఒక ఎంపీటీసీ స్థానాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేశారని కవిత విమర్శించారు. మూడో వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చి పోటీ చేయాలని ఆమె ప్రశ్నించారు. ఇలా చాలా చోట్ల జరిగిందన్నారు.