అక్షరటుడే, వెబ్డెస్క్: New Ration Cards | కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) జారీ చేయలేదు. దీంతో లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు, కుల గణన సందర్భంగా సేకరించిన వివరాలతో అధికారులు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు.
New Ration Cards | తిరుమలగిరిలో ప్రారంభించనున్న సీఎం
సూర్యాపేట జిల్లా (Suryapet District) తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 14న కొత్త రేషణ్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు మిగతా జిల్లాల్లో కూడా రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కొత్త కార్డుల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తులను పరిశీలించిన అధికారులు అర్హుల జాబితాను సిద్ధం చేశారు. చాలా మంది పాత కార్డు ఉన్నప్పటికీ కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో అర్హులకే కొత్త కార్డులు మంజూరు చేయనున్నారు. కొత్తగా రాష్ట్రంలో 2.4 లక్షల కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే పాత కార్డుల్లో కుటుంబ సభ్యులను అధికారులు యాడ్ చేశారు.
New Ration Cards | మూడు రంగుల్లో..
కొత్త రేషన్ కార్డులను మూడు రంగుల్లో మంజూరు చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి మూడు రంగుల కార్డు ఇవ్వనున్నారు. దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వారికి ఆకుపచ్చ రంగు కార్డు అందించనున్నారు.
New Ration Cards | ఏర్పాట్లు చేస్తున్న నేతలు
రేషన్ కార్డుల పంపిణీకి అధికారులు, కాంగ్రెస్ నాయకులు (Congress Leaders) ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సీఎం సభపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డుల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
New Ration Cards | నిరంతర ప్రక్రియ
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత ఉంటూ ఎప్పుడైనా కార్డులు మంజూరు చేస్తామన్నారు. సన్న బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.