అక్షరటుడే, బాన్సువాడ : Indiramma Housing Scheme | పేదల ఆత్మగౌరవ ప్రతీక అయిన సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్ల పథకం నెరవేస్తోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు ప్రతి కుటుంబంలో సంతోషాలు నింపుతున్నాయని పేర్కొన్నారు.
బాన్సువాడ మండలం (Banswada Mandal) నాగారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా గృహప్రవేశం చేసుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మల్యే పోచారం (MLA Pocharam) మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో ఇళ్లు లేని, కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్లు (Indiramma House) మంజూరు చేయిస్తానని తెలిపారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే తమ లక్ష్యమని వివరించారు. అనంతరం బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ఎల్లమ్మ కాలనీ డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్సీ కాలనీలో రూ.70 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub-Collector Kiranmayi) , స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

