అక్షరటుడే, హైదరాబాద్: government employees welfare schemes | ప్రభుత్వ ఉద్యోగుల భద్రత, సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోనే ఆదర్శవంతమైన రెండు కొత్త పథకాలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది.
government employees welfare schemes | ఉద్యోగుల ప్రమాద బీమా పథకం
• తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రమాద బీమా పథకం అమలు చేయనుంది.
• ఉద్యోగులు ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
• మన ప్రభుత్వం తొలిసారిగా సింగరేణిలో, ట్రాన్స్ కోలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్కడ విజయవంతంగా అమలు కావడంతో మిగతా ఉద్యోగులకు విస్తరించేందుకు చర్యలు తీసుకోనుంది.
• ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.1.2 కోట్ల ప్రమాద బీమా పరిహారం అందుతుంది.
• సహజ మరణానికి 60 ఏళ్ల వరకు ఉద్యోగులకు రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది.
• రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ కార్పొరేషన్లు. ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5 లక్షల 19 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. వీరితో పాటు 2 లక్షల 38 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తం 7.57 లక్షల మందికి ఈ ప్రమాద బీమా వర్తిస్తుంది.
• అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా బ్యాంకర్ల ద్వారా బీమా అమలు చేయాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది.
క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్
• దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూస్తున్న మరో కోరికను రాష్ట్ర కేబినెట్ నెరవేర్చింది.
• ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (EHS) అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
• 3 లక్షల 56 వేల మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 2.88 లక్షల మంది పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు మొత్తం 17.07 లక్షల మందికి ఈ పధకం వర్తిస్తుంది.
• ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఆసుపత్రుల్లో ఒక్క రూపాయి చెల్లించకుండానే వైద్య చికిత్సలు అందుతాయి.
• అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 652 ఎంప్యానెల్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ పధకం వర్తిస్తుంది. దీనిపై మొత్తం 1998 వైద్య చికిత్సలు అందిస్తారు.
• ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డ్ అందిస్తారు.
• రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలని కేబినెట్ నిర్ణయించింది.
• ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ పే నుంచి 1.5 శాతం తమ వాటాగా చెల్లిస్తారు. అంతే సమాన వాటాను ప్రభుత్వం మ్యాచింగ్ వాటా చెల్లిస్తుంది.
• ఏడాదికి ఉద్యోగులు రూ. 528 కోట్లు తమ వాటాగా చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా రూ. 528 కోట్లు వాటా చెల్లిస్తుంది. మొత్తం రూ.1056 కోట్ల తో క్యాష్ లెస్ ఎంప్లాయి హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం. కుటుంబ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ హాస్పిటళ్లలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను (TVVP) డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా (DSH) మార్చాలని నిర్ణయించింది. డీఎస్‌హెచ్ బిల్లు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
దీంతో ఇన్నాళ్లు అటానమస్ వ్యవస్థగా ఉన్న టీవీవీపీకి, పూర్తిస్థాయి ప్రభుత్వ విభాగ హోదా లభిస్తుంది. నిధుల కేటాయింపులో ప్రాధాన్యం పెరుగుతుంది. సర్జికల్స్, మెడిసిన్స్ కొనుగోలు వేగంగా జరుగుతుంది. డాక్టర్లు, సిబ్బందికి సకాలంలో వేతనాలు అందడంతో వైద్య సేవలు మెరుగుపడుతాయి.
వైద్య ఆరోగ్య శాఖలో కీలక సంస్కరణలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో వివిధ విభాగాల పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రుల నిర్వహణ సమర్థవంతంగా ఉండేలా చర్యలు చేపట్టాలని చర్చించింది.
అవసరమైన కొత్త విధానాలపై అధ్యయనం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయ, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డిని కమిటీలో నియమించి వారి సలహాలు సూచనలు తీసుకుంటారు.
ఆసుపత్రుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టేందుకు హాస్పిటళ్లలో మెడికల్ సర్వీసెస్ను, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వేరుగా విభజించే ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.
హెచ్ఎండీఏ విస్తరణలో భాగంగా మరో నాలుగు గ్రామాలను హెచ్ఎండీఏ పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లాలోని నవాబ్ పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్ పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను హెచ్ఎండీఏ పరిధిలో చేర్చారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాంప్రెహేన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (CRMP phase 2) చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
