Committee to investigate Miss England allegations
Miss England | మిస్ ఇంగ్లాండ్​ వ్యాఖ్య‌ల‌ని సీరియ‌స్‌గా తీసుకున్న ప్ర‌భుత్వం.. విచార‌ణ‌కు ఆదేశం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Miss England | మిస్ ఇంగ్లాండ్ (Miss England) మిల్లా మాగీ (milla magee) చేసిన ఆరోప‌ణ‌లు ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి.

‘‘నన్ను వేశ్యాలా చూశారు, నాతో అగౌరవంగా ప్రవర్తించారు’’ అంటూ మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌(Miss World Organisation)పై ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపడంతో దీనిపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. అందులో నిజానిజాలు తేల్చాలని ఆదేశించింది. మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్(Shika Goel) నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ విచారణ కమిటీలో సభ్యులుగా ఐపీఎస్ రెమా రాజేశ్వరి (Rema Rajeswari), సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ (ips Sai sri) ఉన్నారు.

Miss England | నిజాలు నిగ్గు తేల్చడానికి..

ఈ కమిటీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లను అడిగి పోటీల నిర్వహణ తీరు ఎలా ఉందో తెలుసుకోనున్నారు. ఈవెంట్ కోసం విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని అందగత్తెలను ఆరా తీయనున్నారు. వీడియోలను సైతం రికార్డ్ చేస్తున్నారు. దేశ పరువు, ప్రతిష్టకు సంబంధించిన విషయం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) దీన్ని సీరియస్ గా తీసుకున్నారట.

స్వయంగా ఎప్పటికప్పుడు విచారణ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారట. కంటెస్టెంట్లతోపాటు.. మిస్ వరల్డ్ సీఈఓ (Miss World CEO) జూలియా మోర్లీ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ నుంచి సైతం పోటీల వివరాలను అడిగి తెలుసుకున్నారు విచారణ అధికారులు. మిల్లా మాగీతో డిన్నర్‌లో ఎవరెవరు పాల్గొన్నారు, ఆరోజు ఆమెతో కూర్చున్న వారి పేర్లతో పాటు పూర్తి వివరాలు సేకరించి దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది విచారణ బృందం.

మిల్లా మాగీ ఆరోపణలు తెలంగాణ ఇమేజ్ ను డ్యామేజ్ చేయ‌నున్న నేప‌థ్యంలో ఈ వ్యవహారంపై బీఆర్ఎస్(BRS) తీవ్రంగా స్పందించింది. నిజానిజాలు రాబట్టేందుకు పూర్తి స్థాయి దర్యాఫ్తు కోరింది. కాగా, మిల్లా మాగీ ఆరోపణలను మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ సీఈవో జూలియా మోర్లే (Julia Morle) ఖండించారు. ఆ వాదనలు నిరాధారమైనవన్నారు. మ‌రోవైపు మిస్‌ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌( Jayesh Ranjan). మిస్ ఇంగ్లాండ్ మాగీ కేవలం 8 రోజులే ఇక్కడున్నారని ఆయన తెలిపారు. ఆమె ఆరోపణల తర్వాత ఇతర పోటీదారులతో తాము మాట్లాడామన్నారు. ఎక్కడా ఇబ్బంది ఎదురు కాలేదని వారు చెప్పారని ఆయన వెల్లడించారు. చౌమహాల్లా ప్యాలెస్​లో ఇచ్చిన విందులో మిస్ ఇంగ్లాండ్​తో పాటు మిస్ వేల్స్ అదే టేబుల్ దగ్గర ఉన్నారని, అక్కడ ఎవరూ తమతో తప్పుగా ప్రవర్తించలేదని మిస్ వేల్స్ చెప్పారని జయేశ్ రంజన్ తెలిపారు.