అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TDP | టీడీపీ (TDP) అంతర్గత రాజకీయాల్లో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. ఎప్పుడూ లేనంతగా నేతల మధ్య విభేదాలు, పదవుల కోసం లాబీయింగ్ కనిపిస్తోంది.
ముఖ్యంగా జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకోవాలన్న పోటీలో పలువురు నేతలు హైకమాండ్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పదవికి ఐదుగురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు కేఎస్ జవహర్‌కి ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా రాజ్యాంగబద్ధ హోదా దక్కడంతో, ఆయన స్థానంలో కొత్త నాయకుడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, సీనియర్ నేత గన్ని కృష్ణ, జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, ఎర్ర వేణుగోపాల్ నాయుడు (Erra Venugopal Naidu)పేర్లు రేసులో ఉన్నాయి.
TDP | ఇద్దరి మధ్య రేసు..
వర్గాల సమాచారం ప్రకారం, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేరుపై మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. అయితే ఆయన ఇప్పటికే రుడా ఛైర్మన్‌గా ఉండటంతో పాటు, ఆయన సామాజిక వర్గానికి ఇప్పటికే కీలక పదవులు దక్కడం వల్ల హైకమాండ్ కొంత ఆలోచనలో పడిందని తెలుస్తోంది. మరోవైపు సీనియర్ నేతలు గన్ని కృష్ణ, ముళ్లపూడి బాపిరాజు పేర్లు కూడా చర్చలో ఉన్నప్పటికీ, పార్టీ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకోవడంతో ఈ ఇద్దరికీ అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన ఎర్ర వేణుగోపాల్ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, ఉమ్మడి తూర్పు జిల్లాలోని కాకినాడ జిల్లా అధ్యక్ష పదవి అదే సామాజిక వర్గానికి దక్కే అవకాశం ఉండటంతో ఆయనకు అవకాశం తక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైకమాండ్ (High Command) దృష్టి ఇప్పుడు కుడుపూడి సత్తిబాబు వైపు మళ్లినట్లు సమాచారం.
పార్టీ వర్గాల ప్రకారం, ఈ రేసు ప్రధానంగా బొడ్డు వెంకటరమణ చౌదరి వర్సెస్ కుడుపూడి సత్తిబాబు మధ్యే కొనసాగుతోంది. ఆసక్తికరంగా, ఈ ఇద్దరూ మంత్రి నారా లోకేశ్‌కు సన్నిహితులుగా పరిగణించబడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా కాపు, శెట్టిబలిజ వర్గాల ప్రభావం ఎక్కువగా ఉండగా, కాకినాడ జిల్లా (Kakinada District)లో కాపు వర్గానికి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశముండటంతో, తూర్పుగోదావరిలో శెట్టిబలిజ వర్గానికి అవకాశం ఇచ్చే దిశగా హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.శెట్టిబలిజ వర్గాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఏకం చేసిన నేతగా కుడుపూడి సత్తిబాబుకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాక, గతంలో వైసీపీ ప్రభుత్వం (YSRCP Government) బీసీ వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో, ఈసారి టీడీపీ కూడా బీసీలకు కీలక పదవులు ఇవ్వాలని భావిస్తోందని రాజకీయ వర్గాల విశ్లేషణ. నామినేటెడ్ పదవుల్లో ఉన్న కుడుపూడి సత్తిబాబు, వెంకటరమణ చౌదరిలలో ఒకరికి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవి దక్కనుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
