అక్షరటుడే, వెబ్డెస్క్ : GST Reforms | వాహన కొనుగోలుదారులకు శుభవార్త. ప్రముఖ సంస్థల కార్ల ధరలు భారీగా దిగి రానున్నాయి. కనీసం రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల దాకా రేట్లు తగ్గనున్నాయి.
వస్తు సేవల పన్ను (GST)ను హేతుబద్ధీకరిస్తూ జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయంతో చిన్న కార్లతో పాటు ఎస్యూవీ (SUV)లపై డిస్కౌంట్ లభించనుంది. జీఎస్టీ సవరణల కారణంగా తగ్గనున్న సుంకాల భారాలను పూర్తిగా వినియోగదారులకు అందించేందుకు కార్ల తయారీ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్ ఈ మేరకు ప్రకటించగా, తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా ఆ జాబితాలోకి చేరింది. ICE SUV పోర్ట్ఫోలియో వాహనాలకు సంబంధించి GST 2.0 ప్రయోజనాలను పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్ (M&M) శనివారం ప్రకటించింది.
GST Reforms | రూ.1.50 లక్షల తాగా తగ్గింపు
జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేయడంతో వాహనాల రేట్లు (Vehicle Price) తగ్గనున్నాయి. గతంలో ఉన్న 12, 28 స్లాబులను ఎత్తివేస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఇది వాహన తయారీ సంస్థలకు వరంగా మారింది. GSTలో తగ్గింపు కారణంగా M&M తన ప్రసిద్ధ మోడళ్లయిన థార్, స్కార్పియో, బొలెరో, XUV700, స్కార్పియో-N కార్లను మోడల్, వేరియంట్ను బట్టి రూ. 1.01 లక్షల నుంచి రూ. 1.56 లక్షల వరకు తగ్గింపు ధరల్లో లభించనున్నాయి. బొలెరో, బొలెరో నియో రూ. 1.27 లక్షల వరకు చౌకగా లభిస్తుండగా, XUV3XO పెట్రోల్ వెర్షన్ పై రూ. 1.40 లక్షల మేర తగ్గింపు లభించనుంది., XUV3XO డీజిల్ వెర్షన్ పైనా రూ. 1.56 లక్షల దాకా తగ్గింపు వర్తించనుంది. థార్ 2WD డీజిల్ను ఎంచుకునే వినియోగదారులు ఇప్పుడు రూ. 1.35 లక్షలు ప్రయోజనం పొందవచ్చు, థార్ 4WD డీజిల్, స్కార్పియో క్లాసిక్ ధరలో రూ. 1.01 లక్షలు, స్కార్పియో-ఎన్ రూ.1.45 లక్షల వరకు, థార్ రాక్స్ రూ.1.33 లక్షల వరకు, ఫ్లాగ్షిప్ XUV700 RS 1.43 లక్షల వరకు దాకా తగ్గింపు పొందవచ్చు.
GST Reforms | టాటా మోటార్స్ కూడా..
టాటా మోటార్స్ (TATA Motors) కూడా సెప్టెంబర్ 22 నుంచి తమ కార్లపై ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జీఎస్టీలో మార్పు వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తిగా కొనుగోలుదారులకే వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది. ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ టియాగోపై రూ. 75,000 వరకు తగ్గుతుందని తెలిపింది. అలాగే కాంపాక్ట్ సెడాన్ టిగోర్ పై రూ. 80,000, ఆల్ట్రోజ్ హ్యాచ్బ్యాక్ పై రూ. 1.10 లక్షల దాకా తగ్గుతాయని తెలిపింది. SUV లలో పంచ్ ధరపై రూ. 85,000, నెక్సాన్ రేట్ పై రూ. 1.55 లక్షల వరకు తగ్గింపు ఉంటుందని పేర్కొంది. టాటా ఇటీవల విడుదల చేసిన మిడ్-సైజ్ మోడల్ కర్వ్వ్ ధరను కూడా రూ. 65,000 తగ్గించనుంది. కంపెనీ ప్రీమియం ఆఫర్లైన హారియర్, సఫారీ ధరల్లో రూ. 1.45 లక్షల దాకా తగ్గుతుందని టాటా మోటార్స్ తెలిపింది.
GST Reforms | ఊపందుకోనున్న విక్రయాలు
GST తగ్గింపుతో వాహన విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు. జీఎస్టీ సవరిస్తారనే అంచనాల నేపథ్యంలో ఆగస్టు మాసంలో విక్రయాలు తగ్గాయి. బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) అధ్యక్షతన జరిగిన 56వ GST కౌన్సిల్ సమావేశం తర్వాత ధరల తగ్గింపు వచ్చింది, ఇది SUVలపై సవరించిన GST మరియు సెస్ రేట్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాహన ధరలు దిగిరానున్నాయి.