అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Job Notification | రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పనుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ(TSPSC) ద్వారా పలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిర్వహిస్తున్న సర్కార్ తాజాగా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని యోచిస్తోంది. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో 5,368 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలు భారీగానే జరిగాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పరీక్షలకు సంబంధించిన కొలువుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ పూర్తి చేసింది. అలాగే అప్పట్లో నోటిఫికేషన్ విడుదలైన గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.
Job Notification | ఖాళీల వివరాలు..
విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే సంబంధిత శాఖలు ఏర్పాట్లు ప్రారంభించాయి. ఎన్పీడీసీఎల్ (NPDCL)లో 2,170, ఎస్పీడీసీఎల్ (SPDCL)లో 2,005, ట్రాన్స్కో (TRANSCo)లో 703, జెన్కో(GECNO)లో 490 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదించాయి. దీంతో ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ పోస్టులకు బీటెక్/బీఈ, డిప్లొమా, ఐటీటీ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులు.