అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ration Cards | ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది. రేషన్‌కార్డులపై ఇక నుంచి గోధుమ పిండి సైతం అందిస్తామని తెలిపింది.
రేషన్ దుకాణాల (Ration Shops) ద్వారా తక్కువ ధరకు నిత్యావసర సరుకులు అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం పలు సరుకులను సైతం తక్కువ ధరకు అందిస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి రేషన్ దుకాణాల్లో రూ. 20కే గోధుమ పిండి సరఫరా చేయాలని నిర్ణయించింది. జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపుల్లో రూ.20కే గోధుమ పిండి ఆదివారం నుంచి అందించనున్నారు. త్వరలో డివిజన్, మండల స్థాయిల్లో కూడా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు.
Ration Cards | పేదలకు ఊరట
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదలకు ఎంతో ఊరటనిస్తోంది. గతంలో రేషన్ దుకాణాల్లో బియ్యం మాత్రమే ఇచ్చేవారు. దీంతో మిగతా సరుకులను ప్రజలు బయట కొనుగోలు చేసేవారు. అయితే నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరగడంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా గోధుమ పిండిని ఇవ్వాలని నిర్ణయించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బయట మార్కెట్లో కిలో గోధుమ పిండి రూ.50 వరకు ఉండగా.. ప్రభుత్వం రూ.20కే అందించనుంది. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ (Civil Supplies Department) గోధుమ పిండి ప్యాకెట్లను రేషన్ డీలర్లకు సరఫరా చేసింది.
Ration Cards | రాగులు, జొన్నలు సైతం..
ఏపీలోని రేషన్ దుకాణాల్లో ఇప్పటికే రాగులు, జొన్నలు, చక్కెర వంటి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. బియ్యం కోటాను తగ్గించి బదులుగా రాగులు, జొన్నలు పంపిణీ చేస్తున్నారు. తెలంగాణలో సైతం రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరుకులు అందించాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో బియ్యం మాత్రమే ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ సైతం చక్కర, గోధుమ పిండి లాంటి సరుకులు పంపిణీ చేయాలని కోరుతున్నారు.