అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cooking Oil | కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొంతకాలంగా పెరిగిన వంట నూనెల(Edible Oil) ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ముడి వంట నూనెల దిగుమతిపై సుంకాన్ని(Import Tax) తగ్గించింది. దీంతో ధరలు దిగి రానున్నాయి. ముడి పామాయిల్, ముడి సోయాబీన్, ముడి సన్‌ఫ్లవర్ నూనెలపై ప్రస్తుతం ఉన్న ప్రాథమిక దిగుమతి సుంకాన్ని (Basic Import Duty) 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం మే 31 నుంచి అమల్లోకి వచ్చిందని ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు.
Cooking Oil | దిగుమతులపైనే ఆధారం
భారత్ వంట నూనెల విషయంలో దిగుమతుల (Imports)పైనే ఆధార పడుతోంది. దేశంలో సరిపడా నూనె గింజలు ఉత్పత్తి కావడం లేదు. రైతులు సంప్రదాయ పంటలైన వరి, గోధుమ, పత్తినే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో నూనె గింజల సాగు తక్కువగా ఉండడంతో భారత్ వంట నూనెల దిగుమతులపై ఆధారపడక తప్పడం లేదు. దేశీయ వంట నూనెల అవసరాల్లో 50 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ముడి వంట నూనెలు, రిఫైన్డ్ వంట నూనెలను మనం దిగుమతి చేసుకుంటున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 159.6 లక్షల టన్నుల ముడి నూనెలను దిగుమతి చేసుకోవడం గమనార్హం. వీటి విలువ రూ.1.32 లక్షల కోట్లు ఉంటుంది.
Cooking Oil | ధరలు తగ్గించే అవకాశం
ప్రస్తుతం కేంద్రం కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో పాటు ఇతర ఛార్జీలను కలిపిన తరువాత ఇప్పుడు ఈ క్రూడ్ నూనెలపై దిగుమతి సుంకం 27.5 శాతం నుంచి 16.5 శాతానికి పడిపోయింది. రిఫైన్డ్ ఆయిల్స్‌పై ఉన్న 35.75 శాతం సుంకంలో కేంద్రం ఎలాంటి మార్పు చేయలేదు. ముడి వంట నూనెల దిగుమతిపై సుంకాలు తగ్గడంతో రిఫైన్డ్ కంపెనీలు ధరలను తగ్గించే అవకాశం ఉంది.