అక్షరటుడే, వెబ్‌డెస్క్: SSC Students | రాష్ట్ర ప్రభుత్వం (State Government) పదో తరగతి విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్ (Evening Snacks) కోసం నిధులు మంజూరు చేసింది.
రాష్ట్రంలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు (SSC Annual Exams) నిర్వహించనున్నారు. పరీక్షల కోసం విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో సాయంత్రం వేళ విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. వారు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాయంత్రం వేళ విద్యార్థులకు స్నాక్స్ అందించాలని ఆదేశించింది. దీని కోసం తాజాగా నిధులు మంజూరు చేసింది.
SSC Students | రూ.4.23 కోట్లు..
సాయంత్రం వేళల్లో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించడం కోసం ప్రభుత్వం రూ.4.23 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కలిపి ఈ మొత్తాన్ని కేటాయించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు 19 రోజుల పాటు ఈ నిధులతో విద్యార్థులకు సాయంత్రం పూట అల్పాహారం అందించాలని ఆదేశించింది. అయితే ప్రస్తుతం కూడా ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. దీంతో సంక్రాంతి తర్వాత నుంచి అల్పాహారం కోసం నిధులు కేటాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా గతంలో దాతల సాయంతో విద్యార్థులకు అల్పాహారం అందించేవారు. తాజాగా ప్రభుత్వం నిధులు కేటాయించడంపై ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.