అక్షరటుడే, వెబ్డెస్క్: Farmers | తెలంగాణ రైతాంగానికి (Telangana farmers) కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. యూరియా కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి భారీగా యూరియా కేటాయించింది. తక్షణమే 50వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. గుజరాత్, కర్ణాటక నుంచి తక్షణమే తెలంగాణకు యూరియా తరలించించాలని ఆదేశించింది.
రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి యూరియా (urea) సరఫరా పెంచే దిశగా చర్యలు చేపట్టింది. రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతను తీర్చేందుకు 50వేల మెట్రిక్ టన్నులను కేటాయించింది. ఈ విషయంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి చర్చించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ వద్ద ఆందోళన సైతం చేపట్టారు. దీంతో కేంద్రం వెంటనే స్పందించి యూరియాను కేటాయించింది. కాగా.. వారం రోజుల్లో తెలంగాణ యూరియా వస్తుందన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు.
Farmers | యూరియా కొరతతో ఇక్కట్లు
రాష్ట్రంలో యూరియా కొరతతో (urea shortage) పలుచోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కోసం సొసైటీల వద్ద బారులు తీరుతున్నారు. వర్షంలో సైతం క్యూలు కడుతున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు యూరియా కొరత సమస్యగా మారింది. దీంతో రైతులు (Farmers) ఎరువుల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్ర నిర్ణయంతో రైతులకు ఊరట లభించనుంది.