అక్షరటుడే, వెబ్డెస్క్ : Mid-day meals | రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో భాగంగా చేపల కూర వడ్డిస్తామని తెలిపింది. త్వరలోనే దీనిని అమలు చేస్తామని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) తెలిపారు. దీనిపై సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)తో చర్చించి పథకాన్ని అమలు చేస్తామన్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో (Govt Schools) ప్రస్తుతం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తున్నారు. విద్యార్థులకు వారానికి రెండు సార్లు ఉడకబెట్టిన గుడ్డు పెడుతున్నారు. మాంసాహారం వడ్డించడం లేదు. త్వరలోనే తెలంగాణలోని సర్కార్ బడుల్లో చదువుతోన్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు వడ్డించాలని భావిస్తున్నట్లు మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (Fisheries Development Board) ఆధ్వర్యంలో నిర్వహంచిన వరల్డ్ ఆక్వా కల్చర్ ఇండియా కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు.
Mid-day meals | రూ.123 కోట్ల బడ్జెట్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి కూడా మత్స్యశాఖను ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారికి ఇవ్వలేదని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనకు ఆ బాధ్యతలు అప్పగించిందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన మత్స్యశాఖను పునర్నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం మత్స్యశాఖకు రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని నీటి వనరుల్లో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
Mid-day meals | చేపల కూర సాధ్యమేనా..
ప్రస్తుతం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. అయితే విద్యార్థులకు తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారు. దీంతో చాలా బడుల్లో తక్కువ ధరకు దొరికే కూరగాయలతో వంటలు చేస్తున్నారు. కొన్ని బడుల్లో నీళ్ల చారుతో సరిపెడుతున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉడకబెట్టిన గుడ్డు అందిస్తున్నారు. అయితే విద్యార్థులకు చేపల కూర వండిపెట్టడం సాధ్యం అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో దాదాపు 500కు పైగా విద్యార్థులు ఉంటారు. ఆయా బడుల్లో ముగ్గురు నుంచి నలుగురు మాత్రమే మధ్యాహ్న భోజన కార్మికులు పని చేస్తున్నారు. అంతమందికి వండిపెట్టడానికి వీరు సరిపోయే అవకాశం లేదు. అలాగే అంతమొత్తంలో చేపలు తీసుకు రావడం కూడా సాధ్యం అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
