అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana University | ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లా విద్యార్థుల కల నెరవేరబోతుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ (Govt Engineering College) లేదు. తెలంగాణ యూనివర్సిటీ (Telangana University), ప్రభుత్వ మెడికల్ కాలేజీ (Medical College) ఉన్నా.. ఇంజినీరింగ్ కాలేజీ మాత్రం లేదు. దీంతో ఇక్కడ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
Telangana University | యూనివర్సిటీలో..
జిల్లాలోని డిచ్పల్లి శివారులో జాతీయ రహదారికి ఆనుకొని విశాలమైన ప్రాంగణంలో తెలంగాణ యూనివర్సిటీ ఉంది. విశ్వవిద్యాలయంలో డిగ్రీ కాలేజీతో పాటు, ఎల్ఎల్బీ, పీజీ కోర్సులు, పీహెచ్డీ అందుబాటులో ఉన్నాయి. అయితే యూనివర్సిటీ ప్రాంగణంలోనే తాజాగా ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
Telangana University | త్వరలో జీవో జారీ
ఉమ్మడి జిల్లాలో ఎంతో మంది విద్యార్థులు ఇంజినీరింగ్ (Engineering) చదువుతున్నారు. అయితే స్థానికంగా కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నప్పటికీ ప్రభుత్వ కళాశాల లేక ఇన్నాళ్లు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు కొన్నేళ్లుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో అధికారులు ప్రతిపాదనలు కూడా పంపారు. అయితే నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ కాలేజీగా మారుస్తారని గతంలో ప్రచారం జరిగింది. తాజాగా ప్రభుత్వం యూనివర్సిటీలో ఏర్పాటు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో జీవో జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Telangana University | అందుబాటులో భవనం
తెయూలో రెండు నెలల క్రితం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి పర్యటించారు. ఆ సందర్భంగా ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు ఆవశ్యకతను సిబ్బంది ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే రూ.22 కోట్ల రూసా నిధులతో నిర్మించిన అతిపెద్ద సైన్స్ భవనం ఉందని వారు తెలిపారు. దీంట్లో కాలేజీ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఆర్థిక భారం పడదని చెప్పినట్లు సమాచారం. ఆయన ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడంతో కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి గతంలో ప్రతిపాదనలు పంపారు.
Telangana University | రెండో విడతలో సీట్ల భర్తీ
ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి తొలి విడత కౌన్సెలింగ్ (Counselling) ప్రక్రియ పూర్తయింది. దీంతో రెండో విడతలో తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసే కాలేజీలో సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదే తరగతులు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. బీటెక్ (B.Tech) సీఎస్ఈ, ప్రస్తుతం డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించిన మరో మూడు కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు. మొత్తం నాలుగు కోర్సుల్లో 60 చొప్పున 240 సీట్లు ఈ కాలేజీలో భర్తీ చేయనున్నారు.
Telangana University | ఇప్పటికే పలు కాలేజీలు
ఉమ్మడి జిల్లా విద్యా పరంగా ఇప్పటికే ముందంజలో ఉంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. డిచ్‌పల్లిలో తెలంగాణ యూనివర్సిటీ ఉంది. అలాగే రుద్రూర్లో ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, కామారెడ్డిలో డెయిరీ టెక్నాలజీ కాలేజీలు ఉన్నాయి. ఫుడ్ సైన్స్, డెయిరీ టెక్నాలజీ కాలేజీల్లో ఈఏపీ సెట్ అగ్రికల్చర్ కోర్సుల కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పడితే జిల్లా విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది.