అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirupati Train | తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు. భక్తుల రద్దీ మేరకు ఇప్పటికే రైల్వే శాఖ(Railway Department) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తిరుపతి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పెద్దపల్లి జంక్షన్ మీదుగా మరొక ప్రత్యేక రైలు(Special Train) నడపడానికి అధికారులు సిద్ధం అయ్యారు.
నాందేడ్ నుంచి ధర్మవరం వరకు వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు(Weekly Express Train)ను దక్షిణ మధ్య రైల్వే జోన్ నాందేడ్ డివిజన్ అధికారులు నడపనున్నారు. ఈ ట్రైన్ నంబర్ నాందేడ్ నుంచి ధర్మవరం వెళ్లేటప్పుడు 07189, ధర్మవరం నుంచి నాందేడ్ వచ్చేటప్పుడు 07190గా ఉంటుంది.
Tirupati Train | ప్రతి శుక్రవారం..
నాందేడ్ నుంచి ధర్మవరం ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం నాందేడ్‌లో 4:30 గంటలకు బయలు దేరుతుంది. బాసర, నిజామాబాద్ జంక్షన్(Nizamabad Junction) మీదుగా వెళ్తుంది. నిజామాబాద్‌కు సాయంత్రం 6:25 గంటకు చేరుకుంటుంది. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జంక్షన్ వరంగల్, విజయవాడ జంక్షన్ మీదుగా మరుసటి రోజు (శనివారం) ఉదయం 11 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అనంతరం పాకాల జంక్షన్, పీలేరు, మదనపల్లి రోడ్డు, కదిరి మీదుగా సాయంత్రం 5 గంటలకు ధర్మవరం వెళ్తుంది.
Tirupati Train | ఈ స్టేషన్లలో ఆగుతుంది
నాందేడ్ – ధర్మవరం వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు మొత్తం 27 స్టేషన్లలో ఆగుతుంది. తెలంగాణ(Telangana)లోని బాసర, నిజామాబాద్, ఆర్మూర్, లింగంపేట –జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం మధిర స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం ఉంది. కోరుట్ల, మెట్పల్లి రైల్వే స్టేషన్లలో కూడా స్టాప్ కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Tirupati Train | ఈ రోజుల్లో..
నాందేడ్ నుంచి ధర్మవరం వీక్లీ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్‌లో నాందేడ్ నుంచి 5, 12, 19, 26 తేదీల్లో నడుస్తుంది. అలాగే ధర్మవరం నుంచి సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రారంభం అవుతుంది. ధర్మవరం నుంచి ప్రతి ఆదివారం ఉదయం 5:30 గంటలకు ఈ ట్రైన్ బయలు దేరుతుంది. సోమవారం ఉదయం 07:30 గంటలకు నాందేడ్ రైల్వే స్టేషన్(Nanded Railway Station)కు చేరుకుంటుంది .
Tirupati Train | రద్దీ మేరకు..
ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తే ప్రస్తుతం నడుస్తున్న నాందేడ్ –తిరుపతి –నాందేడ్ ( 07015/16 ) వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ సర్వీసులాగా దీనిని కూడా మార్చి 2026 వరకు నడపనున్నారు. కదిరి, తిరుపతి(Tirupati), శ్రీ కాళహస్తి, విజయవాడ, బాసర వెళ్లే భక్తులు ఈ రైలు సర్వీసులను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే పెద్దపల్లి జంక్షన్ మీదుగా నాందేడ్ నుంచి తిరుపతి (07015) ప్రతి శనివారం ఒక వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు నడుస్తుండగా ఇప్పుడు అదనంగా దానికి తోడు మరో వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలును ప్రతి శుక్రవారం నడపనున్నారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tirupati Train | పెద్దపల్లి నుంచి..
పెద్దపల్లి(Peddapalli) మీదుగా ఇప్పటికే తిరుపతి వరకు ప్రతి ఆది, గురువారాల్లో 12762 కరీంనగర్ బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, ప్రతి శనివారం 07015 నాందేడ్ –తిరుపతి ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ అందుబాటులో ఉండగా తాజాగా ప్రతి శుక్రవారం 07189 నాందేడ్ – ధర్మవరం ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పెద్దపల్లి నుంచి ఆది, గురు, శుక్ర, శనివారాల్లో తిరుపతికి రైలు అందుబాటులో ఉంది. ఇవన్నీ వయా వరంగల్ – విజయవాడ – గూడూరు మార్గం మీదుగానే నడుస్తాయి. గతంలో నాందేడ్ – ధర్మవరం వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు నిజామాబాదు – కామారెడ్డి – చర్లపల్లి – నల్గొండ – పిడుగురాళ్ల – నంద్యాల – ఎర్రగుంట్ల మీదుగా నడిచేది. ఈ మార్గంలో ప్రయాణికుల నుంచి ఆదరణ లభించకపోవడంతో పెద్దపల్లి – వరంగల్ – విజయవాడ మార్గంలో నడుపుతున్నారు.
Tirupati Train | బుకింగ్స్ ప్రారంభం
నాందేడ్–ధర్మవరం ప్రత్యేక రైలుకు ఐఆర్సీటీసీ పోర్టల్(IRCTC Portal) టికెట్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఈ రైలు అధునాతన ఎల్‌హెచ్‌బీ బోగీలతో నడవనుంది. ఇందులో నాలుగు జనరల్ బోగీలు, 1 వికలాంగుల బోగి, 7 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 6 థర్డ్ ఏసీ బోగీలు, 3 సెకండ్ ఏసీ బోగీలు ఉంటాయి.