అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IRCTC Shirdi Tour | వివిధ క్షేత్రాలను సందర్శించే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు తీసుకొస్తోంది. భక్తులకు అందుబాటు ధరల్లో అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపడుతోంది.
భారత్ గౌరవ్ యాత్ర పేరిట ఐఆర్‌సీటీసీ(IRCTC) ఇప్పటికే పలు పుణ్య క్షేత్రాలను దర్శించే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా షిర్డీ సాయి భక్తుల కోసం సూపర్ ఆఫర్ ప్రవేశ పెట్టింది. రెండు రోజుల్లో షిర్డీ టూర్‌ను పూర్తి చేసే అవకాశం కల్పిస్తోంది. సాయి సన్నిధి (Sai Sannidhi Ex Hyderabad) పేరిట ఈ టూర్‌ను తీసుకు వచ్చింది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు సెప్టెంబర్ 24 నుంచి నవంబర్ 12 వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
IRCTC Shirdi Tour | ప్రతి బుధవారం రైలు
సాయి సన్నిధి టూర్లో భాగంగా ప్రతి బుధవారం కాచిగూడ (Kachiguda) నుంచి రైలు బయలుదేరుతుంది. ఈ రైలు మల్కాజ్గిరి, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో కంఫర్ట్, స్టాండర్డ్ పేరిట రెండు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. కంఫర్ట్ టికెట్ తీసుకుంటే థర్డ్ ఏసీలో ప్రయాణం చేయవచ్చు. స్టాండర్డ్ ప్యాకేజీ తీసుకున్న వారు స్లీపర్ క్లాస్‌లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
IRCTC Shirdi Tour | టూర్ వివరాలు
కాచిగూడ స్టేషన్ నుంచి బుధవారం సాయంత్రం 6.40 గంటలకు 17064 రైలు బయలు దేరుతుంది. రాత్రంతా రైలులోనే ప్రయాణం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు భక్తులు నాగర్‌సోల్ రైల్వేస్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఐఆర్‌సీటీసీ సిబ్బంది షిర్డీలోని హోటల్‌కు తీసుకు వెళ్తారు. అనంతరం సాయిబాబా ఆలయాన్ని(Sai Baba Temple) దర్శించుకోవాలి. దర్శనం టికెట్ ప్యాకేజీలో భాగం కాదు. దానిని భక్తులు సొంతంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
సాయిబాబా దర్శనం పూర్తయ్యాక అదే రోజు సాయంత్రం 5 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. రాత్రి 8:30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్(Nagarsol Station)ను కాచిగూడకు రైలు ఉంటుంది. ఆ రైలులో మూడో రోజు ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
IRCTC Shirdi Tour | రేట్లు ఎలా ఉన్నాయంటే..
ఐఆర్‌సీటీసీ టూర్ ప్రయాణికులకు అందుబాటు ధరలో వివిధ ప్రాంతాలకు ప్యాకేజీలు అమలు చేస్తోంది. షిర్డీ యాత్ర కోసం ఒక్కో ప్రయాణికుడికి కంఫర్ట్‌లో సింగిల్ షేరింగ్ రూమ్‌కు రూ.7,890గా ధర నిర్ణయించారు. డబుల్ షేరింగ్ అయితే రూ.6,660, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.6,640 టికెట్ ధర ఖరారు చేశారు. 5-11 ఏళ్ల మధ్య పిల్లలకు విత్ బెడ్ అయితే రూ.5,730, విత్‌అవుట్ బెడ్ అయితే రూ.5,420 చెల్లించాలి.స్టాండర్డ్‌లో సింగిల్ షేరింగ్ రూమ్‌కు రూ.6,220 చెల్లించాలి. డబుల్ షేరింగ్‌కు రూ.4,980, ట్రిపుల్ షేరింగ్‌కి రూ.4,960 రేటు ఉంది. 5-11 ఏళ్ల చిన్నారులకు బెడ్ సౌకర్యం కావాలంటే రూ.4,060, బెడ్ అవసరం లేకుండా అయితే రూ.3,750 చెల్లించాలి. ప్యాకేజీలో భాగంగా రైలు ప్రయాణంతో పాటు షిర్డీలో వసతి, ఉదయం అల్పాహారం అందిస్తారు.