అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Rajiv Yuva Vikasam | రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు చేయూత అందించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. స్వయం ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగులకు ఈ పథకంలో భాగంగా రూ.50 వేల నుంచి రూ.నాలుగు లక్షల వరకు రాయితీ రుణాలు ఇవ్వనున్నారు. ఈ పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16,25,441 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Rajiv Yuva Vikasam | సిబిల్ స్కోర్ అక్కర్లేదు..
సిబిల్ స్కోర్(CIBIL Score) లేకుంటే రాజీవ్ యువ వికాసం కోసం చేసుకున్న దరఖాస్తులను తిరస్కరిస్తున్నట్లు సోషల్ మీడియా(Social Media)లో ప్రచారం జరిగింది. గతంలో వివిధ రకాల లోన్లు తీసుకొని చెల్లించని వారి దరఖాస్తులను బ్యాంకర్లు పక్కన పెట్టేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా లోన్ సకాలంలో చెల్లించకపోతే సిబిల్ స్కోర్ పడిపోతుంది.
బ్యాంకులు తాము లోన్లు ఇవ్వడానికి సిబిల్ స్కోర్‌నే చూస్తాయి. తక్కువ స్కోర్ ఉంటే రుణాలను ఇవ్వవు. రాజీవ్ యువ వికాసం పథకంలోనూ సిబిల్ తక్కువగా ఉంటే లోన్లు ఇవ్వరని ప్రచారం జరిగింది. దీనిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఖండించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం సిబిల్ స్కోర్ పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేశారు. దీంతో దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Rajiv Yuva Vikasam | అమలు ఎప్పటి నుంచంటే..
రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుంచి అమలు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్, ట్రాక్ రికార్డు, రికవరీ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోరని స్పష్టం చేశారు. కాగా ఈ పథకం కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం సంబంధిత ధ్రువ పత్రాలను ఎంపీడీవో ఆఫీసు(MPDO Office)ల్లో సమర్పించాలని అధికారులు సూచించారు. తాజాగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగంగా సాగుతోంది. అర్హులను ఎంపిక చేయడం కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ మండల స్థాయిలో దాదాపు 90శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఈ పథకం కింద 5 లక్షల మందికి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిసింది.
Rajiv Yuva Vikasam | కొత్తవారికి అవకాశం
రాష్ట్రంలో గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ రుణాలు అందించేవారు. ప్రభుత్వం వాటి స్థానంలో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం(Rajiv Yuva Vikasam Scheme) తీసుకొచ్చింది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎస్సీ, బీసీ, ఐటీడీఏ తదితర సంస్థల రుణాలు పొందిన వారు ఉన్నారని పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాసంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు.