అక్షరటుడే, వెబ్‌డెస్క్ : EPFO | పీఎఫ్ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పీఎఫ్ అకౌంట్ (PF Account) నుంచి డబ్బులు తీసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఈ మేరకు పార్లమెంట్లో కీలక ప్రకటన చేసింది.
ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న వారి జీతం నుంచి ప్రతినెలా పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ అవుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఉద్యోగి బేసిక్ వేతనంలో 12 శాతం పీఎఫ్ కట్ అవుతుంది. అంతే మొత్తంలో ఉద్యోగి పని చేసే సంస్థ కూడా ఆయన ఖాతాలో జమ చేస్తుంది. ఇందులో 8.33 శాతం పెన్షన్ ఖాతాలో జమ అవుతుండగా.. 3.67శాతం పీఎఫ్ ఖాతాలో (PF account) జమ అవుతుంది. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు డ్రా చేసుకోవాలంటే పెన్షన్ ఖాతాలో నుంచి తీసుకునే వీలుండదు. ఉద్యోగి+కంపెనీ జమ చేసిన 3.67శాతం డబ్బుల నుంచే డ్రా చేసుకోవాలి.
EPFO | విత్‌డ్రా ప్రక్రియ సులభతరం
ఉద్యోగులు (Employees) తమ అవసరాల నిమిత్తం పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉంది. పెన్షన్ అకౌంట్లో జమ అయిన డబ్బులు కాకుండా మిగతా డబ్బులను పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే డబ్బులు తీసుకోవడానికి ప్రస్తుతం బ్యాంక్ పాస్‌బుక్ (Bank Passbook) లేదా చెక్ (Check) కాపీ ఫొటో జత చేయాల్సి ఉంది. అయితే ఆ ఫొటోలు సరిగ్గా కనిపించడం లేదని అధికారులు క్లెయిమ్‌లను తిరస్కరిస్తున్నారు. దీంతో బ్యాంక్ ఖాతా బుక్, చెక్ అప్లోడ్ చేయకుండానే డబ్బులు తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎంపీలు విజయ్ వసంత్, మానికం ఠాగోర్ బి, సురేష్ కుమార్ శెట్కర్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర కార్మిక శాఖ (Union Labour Department) సమాధానం చెప్పింది.
EPFO | ఆన్లైన్లోనే..
ఉద్యోగి యూఏఎన్ నంబర్ (UAN) ఆధారంగా పీఎఫ్ అకౌంట్‌కు సంబంధించి లావాదేవీలు అన్ని ఆన్లైన్లో చేసుకునే వీలు ఇప్పటికే ఉంది. కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్ నుంచి పాక్షికంగా డబ్బులు తీసుకోవచ్చు. ఉద్యోగం మానేస్తే పూర్తిగా ఖాతాను మూసి వేయవచ్చు. అయితే దీనికోసం గతంలో పలు డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉండగా.. ఇక నుంచి ఎలాంటి పత్రాలు లేకుండానే డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు.
EPFO | ఓటీపీ ద్వారా..
పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునే ప్రక్రియలో అక్రమాలు జరగకుండా ఈపీఎఫ్‌వో కీలక చర్యలు చేపట్టింది. మోసాలు జరగకుండా ఉండటానికి ఆధార్ ఓటీపీ (OTF), ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి పీఎఫ్ మెంబర్ (PF Member) అకౌంట్ యాక్టివేట్ అయ్యాకే క్లెయిమ్ చేసుకునే వీలు ఉంది. క్లెయిమ్ సెటిల్మెంట్ డబ్బులు కూడా యూఏఎన్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి. దీంతో ఇతరులు డబ్బులు తీసుకునే అవకాశం లేదు. గతంలో 44 కారణాలతో క్లెయిమ్‌లను తిరస్కరించేవారు. ఈపీఎఫ్‌వో వాటిని 18కి తగ్గించింది. దీంతో చందాదారులకు ఎంతో మేలు జరగనుంది.