EPFO
EPFO | పీఎఫ్​ చందాదారులకు గుడ్​న్యూస్​.. సొంతింటి కల కోసం రూల్స్​ మార్పు

అక్షరటుడే, వెబ్​డెస్క్: EPFO | ఈపీఎఫ్​వో సంస్థ తన చందాదారులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. దేశవ్యాప్తంగా ప్రైవేట్​ కంపెనీల్లో (private companies) ఉద్యోగాలు చేసే వారి జీతాల్లో నుంచి ప్రతినెలా కొంత మొత్తం పీఎఫ్​ కట్​ అవుతున్న విషయం తెలిసిందే.

ప్రతి ఉద్యోగి బేసిక్​ వేతనంలో 12 శాతం పీఎఫ్​ కట్​ అవుతుంది. అంతే మొత్తంలో ఉద్యోగి పని చేసే సంస్థ కూడా ఆయన ఖాతాలో జమ చేస్తుంది. ఇందులో 8.33 శాతం పెన్షన్​ ఖాతాలో జమ అవుతుండగా.. 3.67శాతం పీఎఫ్​ ఖాతాలో (PF account) జమ అవుతుంది. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు డ్రా చేసుకోవాలంటే పెన్షన్​ ఖాతాలో నుంచి తీసుకునే వీలుండదు. ఉద్యోగి+కంపెనీ జమ చేసిన 3.67శాతం డబ్బుల నుంచే డ్రా చేసుకోవాలి.

EPFO | సేవలు సులభతరం

ఈపీఎఫ్​వో సేవల కోసం గతంలో ఖాతాదారులు చాలా ఇబ్బందులు పడేవారు. అయితే ప్రస్తుతం ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ సంస్థ కూడా సేవలను సులభతరం చేసింది. అన్ని లావాదేవీలను ఆన్​లైన్​లో చేసే అవకాశం కల్పించింది. ఆన్​లైన్​లోనే డబ్బులు విత్​డ్రా చేసుకోవచ్చు. అయితే వివిధ కారణాలతో డబ్బులు తీసుకోవడానికి సంస్థ అవకాశం కల్పిస్తోంది. అయితే ఇంటి నిర్మాణం, కొనుగోలు కోసం డబ్బులు డ్రా చేసుకోవాలంటే గతంలో ఐదేళ్లు సభ్యులుగా ఉన్న వారికే అవకాశం ఉండేది. తాజాగా ఆ వ్యవధిని సంస్థ మూడేళ్లకు తగ్గించింది.

EPFO | ఒక్కసారి మాత్రమే..

ఈపీఎఫ్​వో తాజా నిర్ణయంతో ఎంతోమందికి మేలు జరగనుంది. చాలా మంది ఉద్యోగంలో చేరిన కొత్తలో ఇల్లు నిర్మించుకోవడమో, కొనుగోలు చేయడమో చేస్తారు. అలాంటి సమయంలో డౌన్​ పేమెంట్​ (down payment) కోసం డబ్బులు కావాల్సి ఉంటుంది. అయితే ఈపీఎఫ్​వోలో ఐదేళ్ల వరకు గతంలో డబ్బులు తీసుకోవడానికి అవకాశం లేక చాలా మంది ఇబ్బంది పడేవారు. తాజాగా ఆ వ్యవధిని మూడేళ్లకు తగ్గించడంతో ఎంతో మంది దీనిని వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 68-BD కింద పీఎఫ్ ఖాతాదారులు ఆస్తి కొనుగోలు, నిర్మాణం లేదా EMI చెల్లింపు కోసం వారి PF మొత్తంలో 90 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. అయితే దీనికింద జీవితంలో ఒక్కసారి మాత్రమే విత్​ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

EPFO | పలు కీలక మార్పులు

ఈపీఎఫ్​వో ఖాతాదారుల కోసం ఇటీవల పలు కీలక మార్పులు తీసుకు వచ్చింది. అత్యవసర ఖర్చుల కోసం యూపీఐ, ఏటీఎం ద్వారా రూ.లక్ష వరకు విత్​ డ్రా చేసుకునే అవకాశాన్ని సంస్థ జూన్​ నుంచి అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఆటోమెటిక్​ క్లెయిమ్​ సెటిల్​మెంట్​ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షలకు పెంచింది. వివిధ క్లెయిమ్​ల కోసం చేసుకున్న దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తోంది. చాలా క్లెయిమ్‌లు 3-4 రోజుల్లోపు ప్రాసెస్ అవుతున్నాయి.