అక్షరటుడే, వెబ్‌డెస్క్ : EPFO | కేంద్ర ప్రభుత్వం(Central Government) పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఖాతాల్లోని మొత్తం డబ్బులను విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది.
దేశవ్యాప్తంగా ఈపీఎఫ్‌వో ఏడు కోట్లకు పైగా చందాదారులు ఉన్నారు. వేతన జీవులు గతంలో తమ అవసరాల నిమిత్తం పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు తీసుకునే వారు. అయితే మొత్తం డబ్బులు తీసుకునే వీలు ఉండేది కాదు. తాజాగా ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఎంప్లాయి, ఎంప్లాయర్ షేర్ నుంచి వంద శాతం డబ్బులు తీసుకునే అవకాశం కల్పించారు. గతంలో ఉద్యోగ విరమణ చేసిన సమయంలో, జాబ్ మానేసినప్పుడు మాత్రమే మొత్తం డబ్బులు తీసుకునే అవకాశం ఉండేది.
EPFO | మరింత సులువుగా..
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా(PF Money Withdraw) చేసుకోవడానికి నిబంధనలు సైతం ఈపీఎఫ్‌వో సడలించింది. అంతేగాకుండా పాక్షికంగా డబ్బులు తీసుకోవాలనుకుంటే.. 90శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది. భూమి, ఇళ్లు కొనుగోలు వంటి అత్యవసర సమయంలో డబ్బులు తీసుకోవాలనుకుంటే గరిష్ఠంగా 90శాతం పొందే విధంగా రూల్స్ మార్చింది. డబ్బులు తీసుకోవడానికి గతంలో 13 నిబంధనలు ఉండగా.. తాజాగా వాటిని మూడింటికి తగ్గించింది. డబ్బులు తీసుకోవడానికి కనీస సర్వీస్ కాలాన్ని సైతం 12 నెలలకు తగ్గించింది.
పిల్లల చదువుల(Childrens Education) కోసం పది సార్లు పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అలాగే వివాహ సంబంధిత శుభకార్యాల నిమిత్తం ఐదు సార్లు తీసుకునే అవకాశం కల్పించింది. గతంలో ఈ రెండు అవసరాల కోసం మూడు సార్లు మాత్రమే తీసుకునే అవకాశం ఉండేది. ఈపీఎఫ్‌లో భారీగా నగదు నిల్వలు పేరుకుపోవడంతో వాటిని తగ్గించుకోవడానికి ఈపీఎఫ్‌వో చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే చందాదారులు నగదు ఉపసంహరించుకోవడానికి నిబంధనలు సడలించింది.