అక్షరటుడే, వెబ్డెస్క్:Deputy CM Pawan Kalyan | జనసేన పార్టీ ముఖ్య నేత, ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababau Naidu) స్వయంగా నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటామని ప్రకటించినా.. ఇప్పటివరకు ఆ నిర్ణయం కార్యరూపం దాల్చకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) స్పందించారు. “నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదు. ఆగస్టులో మంత్రివర్గ విస్తరణపై ఆలోచిస్తున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.
Deputy CM Pawan Kalyan | పవన్ కల్యాణ్ క్లారిటీ..
2024లో జరిగిన శాసనమండలి ఎన్నికల తర్వాత నాగబాబు ఎమ్మెల్సీ(Nagababau MLC)గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆయనకు మంత్రి పదవి లభిస్తుందనే ప్రచారం జోరుగా సాగింది. తొలుత ఉగాది తర్వాత, ఆపై ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణ(Cabinet Expansion) జరుగుతుందని ఊహించినా.. అవన్నీ వాయిదా పడ్డాయి. ఇక పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఆగస్టులో విస్తరణ జరిగే అవకాశాలపై మళ్లీ ఆసక్తి నెలకొంది. 2024 ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానాన్ని జనసేనకు కాకుండా మిత్రపక్షమైన బీజేపీకి ఇవ్వడంతో, నాగబాబు తన పోటీ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆయన త్యాగానికి గుర్తింపుగా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ మాత్రం ఇంకా నెరవేరలేదు.
పార్టీ శ్రేణుల నుంచి కూడా అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మాట్లాడిన పవన్ కల్యాణ్.. ప్రస్తుతం జనసేన(Janasena)ను గ్రామస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారించాం. పట్టణాల్లో కూడా పార్టీని పటిష్టం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. కేబినెట్ విస్తరణకు సంబంధించి తుది నిర్ణయం సీఎం చంద్రబాబునాయుడిదే అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఆలస్యమైన మంత్రివర్గ విస్తరణ ఆగస్టులో జరగవచ్చని సంకేతాలు అందుతున్నాయి. ఈ విస్తరణలో నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందా? లేక మరోసారి నిరాశే మిగిలిందా? అన్నది తెలియాల్సి ఉంది.