అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Paddy Bonus | రాష్ట్ర ప్రభుత్వం రైతులకు (farmers) గుడ్ న్యూస్ చెప్పింది. సన్న రకం ధాన్యానికి బోనస్ డబ్బులు విడుదల చేసింది.
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ (Congress party) ప్రకటించింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చాక సన్న వడ్లకు బోనస్ ప్రకటించింది. గత వానాకాలం సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన వారికి బోనస్ డబ్బులు జమ అయ్యాయి. దీంతో యాసంగిలో చాలా మంది రైతులు సన్న రకాలను సాగు చేశారు. అయితే ప్రభుత్వం యాసంగిలో సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లించలేదు. దీంతో వానాకాలంలో సైతం చెల్లిస్తారా లేదా అని రైతులు ఆందోళన చెందారు.
Paddy Bonus | వెంటవెంటనే..
వానాకాలం సీజన్లో (monsoon season) కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు తొలుత వెంటవెంటనే బోనస్ జమ అయింది. అనంతరం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బోనస్ విడుదలలో కాస్త జాప్యం నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పలువురు రైతులకు ప్రభుత్వం బోనస్ డబ్బులను విడుదల చేసింది. మిగిలిన రైతులకు సోమవారం నుంచి బోనస్ డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రూ.649 కోట్లను కేటాయించింది. సోమవారం నుంచే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ కానుంది.
Paddy Bonus | యాసంగిలో వేస్తారా..
ప్రస్తుతం బోనస్ డబ్బులు జమ అవుతుండటంతో యాసంగి సీజన్లో సైతం చాలా మంది రైతులు సన్న రకాలను సాగు చేస్తున్నారు. అయితే గత యాసంగిలో ప్రభుత్వం బోనస్ ఇవ్వలేదు. దీంతో ఈ సారి సాగు చేసేవారు ఆందోళన చెందుతున్నారు. బోనస్‌పై ముందుగానే స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుందని రైతులు అంటున్నారు. సన్నాలకు పెట్టుబడి అధికం అవుతుందని, దిగుబడి తక్కువగా వస్తుందని చెబుతున్నారు. అయితే బోనస్ వస్తే తమకు లాభం చేకూరుతుందని లేకపోతే నష్టపోతామని రైతులు చెబుతున్నారు.