అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Govt Employees | రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లులకు సంబంధించి రూ.707.30 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పలు బిల్లులు (Pending Bills) చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. మెడికల్ క్లెయిమ్‌లు, ఇతర బిల్లులు చెల్లించాలని కొంతకాలంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో భట్టి విక్రమార్కతో భేటీలో సైతం ఉద్యోగ సంఘాల నేతలు ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన ఆయన విడతల వారీగా బిల్లులు విడదల చేస్తామని హామీ ఇచ్చారు.
Govt Employees | నాలుగు నెలలుగా..
ఉప ముఖ్యమంత్రి సూచనలను అనుసరించి, ఆర్థిక శాఖ అధికారులు నవంబర్ నెలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి నెలా రూ.700 కోట్లకు పైగా విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బిల్లులను క్లియర్ చేయడానికి ఆర్థిక శాఖ ఈ నెల రూ.707.30 కోట్లు విడుదల చేసింది. వరుసగా నాలుగో నెలా ఉద్యోగుల బకాయిలను విడుదల చేయడం గమనార్హం. ఈ బిల్లులలో గ్రాట్యుటీ, GPF, సరెండర్ లీవ్, వివిధ అడ్వాన్స్‌లు ఉన్నాయి. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన బకాయిలు సైతం త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు.