అక్షరటుడే, వెబ్డెస్క్: Special Trains | శబరిమల, అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా క్షేత్రాలకు నిజామాబాద్ (Nizamabad) మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వేలాది మంది భక్తులు అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్తుంటారు. వారికోసం ఈ నెల 20 వ తేదీ నుండి వచ్చే సంవత్సరం జనవరి 15 వరకు నాందేడ్ నుంచి కేరళ (Nanded to Kerala)రాష్ట్రంలోని కొల్లం వరకు నిజామాబాదు మీదుగా 07111 ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును నడపనున్నారు. దిగువ మార్గంలో తొమ్మిది ట్రిప్లు , ఎగువ మార్గంలో కొల్లం నుంచి నాందేడ్ 07112 ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు తొమ్మిది ట్రిప్లు ( నవంబర్ 22 నుంచి జనవరి 17 ) వరకు నడుస్తాయి . ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లకు నిజామాబాద్ జంక్షన్ (Nizamabad Junction), కామారెడ్డి రైల్వే స్టేషన్లలో (Kamareddy railway station) స్టాప్ సదుపాయం కల్పించారు. కాచిగూడ – మహబూబ్ నగర్ – గద్వాల – కర్నూలు – కడప – రేణిగుంట – కాట్పాడి – ఈరోడ్ – పాలక్కడ్ మీదుగా ఈ రైళ్లు నడుస్తాయి
Special Trains | అరుణాచలం క్షేత్రానికి..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే జోన్ (South Central Railway Zone) నాందేడ్ డివిజన్ అధికారులు ఈ నెల 18 వ తేదీ నుంచి వీక్లీ ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. 07615 నాందేడ్ నుంచి తిరుచిరాపల్లి వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 30 వరకు దిగువ మార్గంలో ఏడు సర్వీసులు నడుస్తుంది. తిరుచిరాపల్లి నుంచి నాందేడ్ వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ (07616 ) ఈ నెల 19 నుంచి వచ్చే నెల 31 వరకు ఎగువ మార్గంలో 7 సర్వీసులు నడపనున్నారు. ఈ రైలు ఉమ్మడి నిజామాబాద్ జంక్షన్, కామారెడ్డి రైల్వే స్టేషన్లలో ఆగనుంది. ఈ రైళ్లు వయా చర్లపల్లి – నల్గొండ – గుంటూరు – తెనాలి – గూడూరు – తిరుపతి – కాట్ పాడి – తిరువణ్ణామలై – శ్రీరంగం మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
Special Trains | పలు రైళ్ల పొడిగింపు
పెద్దపల్లి జంక్షన్ మీదుగా నడిచే నాందేడ్ నుంచి ధర్మవరం వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ (07189) సేవలను 2026 మార్చి 27వ తేదీ వరకు పొడిగించారు. పెద్దపల్లి జంక్షన్ మీదుగా నడిచే నాందేడ్ –తిరుచానూరు (Nanded-Tiruchanur)(07015) వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలు సేవలను 2026 మార్చి 29 వరకు పొడిగించారు. మరో 4 నెలలు తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోగలరు. నాందేడ్ నుంచి తిరుచానూరు (తిరుపతి) వీక్లి ఎక్స్ప్రెస్కు ఆర్మూర్ రైల్వే స్టేషన్లో స్టాప్ సదుపాయం కల్పించాలని ఇక్కడి భక్తులు కోరుతున్నారు. ఈ విషయమై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
