Homeభక్తిTirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. తిరుమలలో మరో క్యూ కాంప్లెక్స్​!

Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. తిరుమలలో మరో క్యూ కాంప్లెక్స్​!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. రోజు రోజుకు తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. దీంతో టీటీడీ (TTD) భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు పరిశీలన కోసం నిపుణుల కమిటీ వేయాలని టీటీడీ నిర్ణయించింది. మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం నిర్వహించారు. అనంతరం ఛైర్మన్​ బీఆర్​ నాయుడు వివరాలు వెల్లడించారు.

Tirumala | విశ్రాంతి కేంద్రాల ఏర్పాటు

⁠తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో మౌలిక వసతులు, లైటింగ్, భద్రత చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.⁠ ⁠తిరుమలలోని శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్, డీపీఆర్ రూపొందించనున్నారు.

Tirumala | సైబర్​ సెక్యూరిటీ ల్యాబ్​

⁠శ్రీవారి భక్తులు సైబర్ నేరాలకు గురికాకుండా నియంత్రించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ (Cyber Security Lab) ఏర్పాటుకు టీటీడీ ఆమోదం తెలిపింది. అలాగే భక్తులకు స్వచ్ఛంద సేవను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు నాలుగు కో–ఆర్డినేటర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు. తిరుమలలో అన్ని విభాగాలు ఒకచోట ఉండేలా నూతన పరిపాలన భవనం నిర్మాణానికి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది.

Tirumala | ఒంటిమిట్టలో అన్నప్రసాదం

ఒంటిమిట్ట కోదండరామస్వామి (Vontimitta Kodanda Rama Swamy Temple) వారి దర్శనానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు రూ.4.35 కోట్లు కేటాయించిన‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ తెలిపారు. అలాగే సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 320 ఆలయాలకు రూ.79.82 లక్షలతో మైక్ సెట్లను అందించాలని నిర్ణయించామన్నారు. నిరుద్యోగులైన వేద పారాయణదారులకు దేవదాయశాఖ ద్వారా నిరుద్యోగ భృతిని చెల్లించేందుకు రూ.2.16 కోట్ల టీటీడీ నిధులు మంజూరుకు ఆమోదం తెలిపారు.

హైకోర్టు తీర్పు మేరకు టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పని చేస్తున్న 142 మందిని క్రమబద్దీకరించేందుకు ఆమోదం తెలిపారు. స‌మావేశంలో ఈవో శ్యామలరావు, అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి, బోర్డు స‌భ్యులు, జెఈవో వీర‌బ్ర‌హ్మం తదితరులు పాల్గొన్నారు.