అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Srisailam Temple | శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామి వారి స్పర్శ దర్శనం వేళలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
శ్రీశైలం మల్లికార్జున స్వామి (Srisailam Mallikarjuna Swamy) దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తారు. చాలా మంది స్పర్శ దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. అయితే గతంలో స్పర్శ దర్శనం సమయం తక్కువగా ఉండటంతో కొద్దిమంది భక్తులకు మాత్రమే ఆ అవకాశం లభించేది. ఈ క్రమంలో తాజాగా ఆలయ అధికారులు స్పర్శ దర్శనం సమయాన్ని పెంచారు. అలాగే మిగతా దర్శన వేళల్లో కూడా మార్పులు చేశారు. ఈ మార్పులు జనవరి నుంచి అమలులోకి రానున్నాయి.
Srisailam Temple | మూడు విడతలుగా..
భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు స్పర్శ దర్శన సమయాలను పొడిగించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి రోజు 4:30 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారి అలంకార దర్శనం, ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం, 7 గంటల నుంచి నుంచి 8.30 వరకు స్పర్శ దర్శనం కోసం కేటాయించారు. ఉదయం 10.30 నుంచి 11.30 వరకు వీఐపీ బ్రేక్, ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. సాయంత్రం 7.45 నుంచి 8 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు స్పర్శ దర్శనం చేసుకునేలా టికెట్లు విడుదల చేయనున్నారు. మొత్తం మూడు విడతల్లో సామాన్య భక్తులకు స్వామి వారి స్పర్శ దర్శన సౌకర్యం కల్పించారు.
Srisailam Temple | ఆ రోజుల్లో ఉండదు
భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవు దినాలు, పండుగ రోజుల్లో స్పర్శ దర్శనం ఉండదు. భక్తులు స్పర్శ దర్శనం టికెట్లను www.aptemples.ap.gov.in, www.srisailadevasthanam.org వెబ్సైట్లలో బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకునే అవకాశంది. రూ.150 శీఘ్ర దర్శనం, రూ.300 అతిశీఘ్ర దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు కరెంటు బుకింగ్ ద్వారా కూడా అందుబాటులో ఉంచారు.