అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ganesh Immersion | హైదరాబాద్ (Hyderabad) నగరంలో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి హుస్సేన్ సాగర్‌తో పాటు పలు చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.
నగరంలోని 20 చెరువులు, పలు కృత్రిమ కొలనుల్లో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్‌కు భారీగా గణనాథులు బారులు తీరాయి. నిమజ్జన శోభాయాత్రతో నగరం అంతా భక్తులతో సందడిగా కనిపిస్తోంది. రేపటి వరకు నిమజ్జనం కొనసాగనుంది.
Ganesh Immersion | ట్రాఫిక్ ఆంక్షలు
నిమజ్జనం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) అమలులో ఉన్నాయి. వినాయక విగ్రహాలు వెళ్లే మార్గంలో ఇతర వాహనాలను అనుమతించడం లేదు. నగరంలో ఆదివారం రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఆర్టీసీ బస్సులను (RTC Bus) సైతం మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్ వరకే అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు ఇళ్లకు చేరడానికి లోకల్ రైళ్లను అధికారులు నడపనున్నారు.
Ganesh Immersion | 8 ఎంఎంటీఎస్ రైళ్లు
నిమజ్జనం నేపథ్యంలో భక్తులను క్షేమంగా ఇళ్లకు చేర్చడానికి రాత్రంతా ఎంఎంటీఎస్ (MMTS) సేవలు అందించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4.40 గంటల వరకు MMTS రైళ్లు తిరగనున్నాయి. సికింద్రాబాద్-ఫలక్ నుమా, సికింద్రాబాద్-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-సికింద్రాబాద్ మధ్య 8 ఎంఎంటీఎస్ రైల్లు సేవలు అందించనున్నాయి. భక్తుల కోసం మెట్రో రైలు సేవలను సైతం రాత్రి ఒంటి గంట వరకు పొడిగించారు. వాహనాలు అనుమతించకపోవడం, బస్సులు లేకపోవడంతో నగరవాసులు ఎంఎంటీఎస్, మెట్రో సేవలను వినియోగించుకోనున్నారు. ఆయా రైళ్లలో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది.